![Violent Protests In Bihar Over Railways Exam Aspirants Set Train On Fire - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/26/train.gif.webp?itok=nOQ5jN4e)
పట్నా: బిహార్‌లో నిరుద్యోగులు మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఆతర్వాత ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.
పోలీసు అధికారుల ప్రకారం.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్‌టెక్నికల్ పాపులర్ (RRB-NTPC) సీబీటీ-1 పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. కాగా, అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిహర్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్‌పై చేరుకుని నిరసనలు తెలిపారు. జెహనాబాద్‌లో రైలుపట్టాలపై మోదీ దిష్టిబొమ్మను దహనంచేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అదే విధంగా, సీతామర్హి ప్రాంతంలోను ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కాగా, నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుచోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు. నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాలో నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ స్పందించింది. తాము.. నోటిఫికేషన్లోనే రెండో దశ వివరాలను కూడా తెలిపామని స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరికి సబంధించి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్ వేదికగా తెలిపింది.
నిరసన కారుల ఆందోళన ప్రధానంగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ఆయా మార్గాల్లో ప్రభావం చూపింది. దాదాపు 25 కంటే ఎక్కువ రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పట్నాలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా పట్నా రైల్వేస్టేషన్‌ను విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.
చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
Comments
Please login to add a commentAdd a comment