మెదక్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాదవ్‌బబ్లూ అంత్యక్రియలు మండలంలోని నాగపూర్‌లో బుధవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అతడి పార్థీవదేహం సొంతూరకు మధ్యాహ్నానికి చేరుకుంది. అప్పటికే వేచియున్న కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.
మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడే సురేశ్ షెట్కార్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మృతుడి తండ్రి సంతోష్‌నాయక్‌తోపాటు కుటుంబీకులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి కూడా సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు.
రెండు నెలలు కాకుండానే..
ట్రిపుల్‌ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పట్లో స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని, మెయిల్ పద్ధతిలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. జూన్‌లో 48 గంటల వ్యవధిలో విద్యార్థినులు వడ్ల దీపిక, బూర లిఖిత ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు.
కానీ.. ఆ ఘటనలు జరిగి రెండు నెలలు కాకుండానే పీయూసీ–1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితాలపై సమీక్ష చేయడంలేదనే విమర్శలున్నాయి. తాజాగా బుధవారం మరోసారి ఇదే విషయమై వీసీ వెంకటరమణ కొత్త నిబంధనలు తెరపైకితెచ్చారు. ఇప్పటికై నా నిబంధనలు అమలు చేసి విద్యార్థుల్లో భరోసా నింపాల్సిన అవసరముందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు...
జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో బుధవారం కూడా క్యాంపస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్, వీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరాం తదితరులు కళాశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, వీరిని ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది, పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిర్మల్ ఆస్పత్రి వద్ద బబ్లూ మృతదేహాన్ని తరలించేదాకా ఎవరినీ అనుమతించలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్, ఎన్‌ఆర్‌ఐ బాజీరావుబోస్లేతోపాటు పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నిర్మల్ ఆస్పత్రి నుంచి బబ్లూ మృతదేహాన్ని తీసుకువెళ్లిన బంధువులు స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం నాగాపూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బబ్లూ మృతికి వీసీ వెంకటరమణ, సిబ్బంది కళాశాలలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
బబ్లూ కుటుంబానికి వీసీ వెంకటరమణ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇకనుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చెప్పుకోలేని విషయాలను తెలుసుకునేందుకు కొత్తగా ముగ్గురు కౌన్సిలర్‌లను నియమిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రుల కోసం పది రోజుల్లో ప్రధాన ద్వారం వద్ద ఒక పేరెంట్స్ లాంజ్ ఏర్పాటు చేస్తామన్నారు. బాసర మండలం నుంచి ఎంపికై న 15మంది విద్యార్థులతో కలిసి ‘వీసీ మై విలేజ్’ ప్రోగ్రాంను నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలో ‘సలహా’ బాక్స్‌లు ఏర్పాటుచేసి 15రోజులకోసారి తెరిచి అందులో విద్యార్థులు లేఖల ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు బెదిరింపులకు గురైతే మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలిపినా రక్షణ కల్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment