టేకు చెట్లపై గొడ్డలి వేటు
ఈ చిత్రంలో కనిపిస్తున్న అటవీ అధికారి రవికుమార్. నచ్చన్‌ఎల్లాపూర్ సమీపంలో కొద్ది రోజుల క్రితం రోడ్డు పక్కనే స్మగ్లర్లు టేకుచెట్లను కొద్దిమేర నరికి వదిలేశారు. ఆప్రాంతాన్ని ఈ అధికారి సందర్శించి సెల్ఫీ దిగి అధికారులకు పెట్టి వదిలేశారు. ఆతర్వాత రోజే స్మగ్లర్లు రెండు చెట్లను పూర్తిగా నరికి తరలించుకుపోయారు. ఇంత జరిగినా అటవీ అధికారులు స్పందించకపోవడంతో స్మగ్లర్లు ధర్మాజీపేట్ మూలమలుపు వద్ద పది చెట్లను నరికివేశారు. మొదటి ఘటన తర్వాత అటవీ అధికారులు గస్తీ నిర్వహించి ఉంటే.. స్మగ్లర్లు దొరికేవారు. పది టేకు చెట్లను కాపాడేవారు.
కడెం: స్మగ్లర్ల గొడ్డలి వేటుకు కవ్వాల్ అభయారణ్యంలో టేకు చెట్లు నేల కూలుతున్నాయి. ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న చెట్లనే యథేచ్ఛగా నరికి కలప తరలించుకుపోతున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు మాయమవుతున్నా.. అటవీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీరేంజ్ కార్యాలయానికి సమీపంలో.. రోడ్డు పక్కనే ఉన్న చెట్లను కూడా అటవీ అధికారులు కాపాడకపోవడం చర్చనీయాంశమైంది. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కడెం మండలం పెద్దూర్ నుంచి నచ్చన్‌ఎల్లాపూర్ మధ్యలో ఉన్న నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారికి ఇరువైపులా దాదాపు 13 టేకు చెట్లు స్మగ్లర్ల ధాటికి కనుమరుగయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యం
అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో అడవుల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కడెం మండలం పెద్దూరు నుంచి నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామం వరకు నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారికి ఇరువైపులా గడిచిన రెండు నెలల వ్యవధిలో 13 భారీ టేకు వృక్షాలను స్మగ్లర్లు తరలించుకుపోయారు. ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు కానరావడం లేదు. చెట్లను నరుకుతున్న స్మగ్లర్లను నియంత్రించడంలో అధికా రులు విఫలమవుతున్నారు. ఇప్పటికై నా చెట్లు నరికివేతకు గురైన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
రెచ్చిపోతున్న స్మగ్లర్లు
రోడ్ల వెంట ఉన్న వృక్షాలు నరికివేత
తరలిపోతున్న కలప
పట్టించుకోని అధికారులు
వనాలను కాపాడాలి
భవిష్యత్ తరాల మనుగడ కోసం వనాలను కాపాడాలి. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
– ముక్కెర గంగాధర్, కొండుకూర్
చర్యలు తీసుకుంటాం
చెట్లు నరకడం చట్టరీత్యా నేరం. కలపస్మగ్లర్లపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపైనా చర్యలు తీసుకుంటాం. – శాంతారాం, ఎఫ్‌డీపీటీ
Comments
Please login to add a commentAdd a comment