ప్రజా సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్: ప్రజావాణిలో ప్రజలు తెలిపే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కలెక్టర్‌కు సమస్య విన్నవించి అర్జీలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఈనెల 6తో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగుస్తుందని, అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈవీఎంల గోదాం తనిఖీ..
కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం పరిశీలించారు. గోదాం వద్ద భద్రత, నిర్వహణలపై సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment