రైతులకు అండగా ఉంటా
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
లక్ష్మణచాంద/నిర్మల్ రూరల్: రైతులకు ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి అండగా ఉంటానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, లక్ష్మణచాంద మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను, పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. నర్సాపూర్(డబ్ల్యూ) ఎక్స్‌రోడ్ నుంచి మండల కేంద్రం వరకు రూ.68 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు రెన్యూవల్ పనులకు భూమిపూజ చేశారు. మండలంలోని నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణచాంద, ధర్మారం గ్రామాలలో డీసీఎంఎస్, పీఏ సీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతు భరోసా ఇవ్వలేదని, కూలీలకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వలేదని పేర్కొన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం.. ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామంటున్నాడని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. మండల కేంద్రం నుంచి బాబాపూర్ వరకు రూ.38 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాధనలు పంపామన్నారు. తహసీల్దార్ జానకి, నిర్మల్ ఏఎంసీ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణప్రసాద్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ఏవో వసంత్, బీజేపీ నాయకులు సరికెల గంగన్న, రావుల రాంనాథ్, భూపాల్‌రెడ్డి, జమాల్, కౌన్సిలర్ సుధాకర్, తోకల అనిల్, అడ్వాల రమేశ్, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment