ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు? | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?

Published Mon, May 6 2024 6:00 AM

-

తెయూ(డిచ్‌పల్లి): వార్షిక అనుబంధ గుర్తింపు తనిఖీ సందర్భంగా సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ నుంచి తెలంగాణ యూ నివర్సిటీ అధికారులు వివరణ కోరేందుకు సిద్ధమై నట్లు సమాచారం. తెయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల గుర్తింపు తనిఖీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ మార్చి 7న విడుదల చేశారు. తనిఖీల సందర్భంగా ఆయా కళాశాలలకు సంబంధించిన డాక్యుమెంట్‌లు, బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపుల రికార్డులు, ఇతర వివరాలు సిద్ధంగా ఉంచాలని వర్సిటీ అధికారులు పలుమార్లు కాలేజీలకు సూచించారు.

సమాచారం ఇచ్చినా..

తనిఖీలు ఏప్రిల్‌ 25 నుంచి మొదలవుతాయని ఏప్రిల్‌ 2న మరోసారి వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలకు ఆడిట్‌ సెల్‌ అధికారులు సమాచారాన్ని అందించారు. శనివారం (మే 4న) ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తనిఖీలకు వచ్చిన వర్సిటీ అధికారులకు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అసంపూర్తిగా సమాచారాన్ని ఇవ్వడంతో వారు అసహనానికి గురయ్యారు. తమకు శనివారం ఉదయం వరకు తనిఖీల సమాచారం లేదని, ప్రిన్సిపాల్‌ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిబ్బంది చెప్పడంతో వర్సిటీ అధికారులు అవాక్కయ్యారు. అయితే అప్పటికప్పుడు కనీసం ఎవరికై న ఇన్‌చార్జి ఇవ్వాలని కోరినా ప్రిన్సిపాల్‌ నుంచి స్పందన కరువైంది. సుమారు రెండు గంటల తర్వాత ప్రిన్సిపాల్‌ చెప్పారని ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌కు కాకుండా తనిఖీ బృందంలోని మరో అధికారికి కాలేజీ పార్ట్‌ టైం ఉద్యోగి లేఖ ఇవ్వగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.

అధికారుల ఆగ్రహం

అడ్మిషన్‌ రిజిస్టర్‌ అసంపూర్తిగా ఉందని, లైబ్రేరియ న్‌ అందుబాటులో లేడని, ఉన్న సిబ్బంది వర్సిటీ అధికారులు అడిగిన వాటికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్సిటీ అధికారులు ప్రిన్సిపాల్‌ను వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌ వైఖరి ఎప్పుడూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటుందని తనిఖీ బృందం సభ్యులు ఒకరు చెప్పారు. ప్రిన్సిపాల్‌ గైర్హాజరు, నిర్లక్ష్య వైఖరిపై కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement