డాటాలో తప్పులు రావొద్దు
మోర్తాడ్(బాల్కొండ): సమగ్ర సర్వే వివరాలను నమోదు చేసిన ఎన్యుమరేటర్లే కంప్యూటర్ ఆపరేటర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి సందేశాలు అందాయి. శుక్రవారం మండల కార్యాలయాల్లో సమగ్ర సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ఆరంభమైంది. మండల పరిషత్, రెవెన్యూ, మండల సమాఖ్య కార్యాలయాలు ఇలా అన్ని శాఖల కార్యాలయాల్లో ఉన్న ఆపరేటర్లతో సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదును ప్రారంభించారు. కార్యాలయాలతో పాటు అందుబాటులో ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోను ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో 40 నుంచి 80 మంది వరకు ఆపరేటర్లతో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మొదలైంది. రెవెన్యూ డివిజన్‌ల వారిగా ఎంపీడీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లకు రెండు రోజుల పాటు శిక్షణ కొనసాగింది. మండల పరిషత్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, రెవెన్యూ, సెర్ప్, గ్రామ పంచాయతీల ఆపరేటర్లతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని డాటా ఎంట్రీ కోసం విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలో 4,69,988 కుటుంబాలు ఉండగా వీరి వివరాల నమోదుకు 3,453 మంది ఎన్యమరేటర్లను నియమించారు. జిల్లాలో దాదాపు సర్వే పూర్తి అయ్యింది. ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది సర్వే నమోదు పెండింగ్‌లో ఉంది. సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని కుటుంబాల వారు గ్రామ పంచాయతీలో తమ వివరాలను అందించాలని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇప్పటికే సేకరించిన సర్వే వివరాలను ఈనెలాఖరులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఎస్‌ఈఈపీసీ సర్వే అనే సాఫ్ట్‌వేర్‌లో డాటా ఎంట్రీని నిర్వహించనున్నారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు కనీసం 25 కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. తొమ్మిది రోజుల్లో సర్వే వివరాల నమోదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సర్వే వివరాలను నమోదు చేసిన ఉద్యోగులే డాటా ఎంట్రీ చేయిస్తే తప్పులు దొర్లకుండా ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సర్వే ఆన్‌లైన్ నమోదు బాధ్యత
ఎన్యుమరేటర్లకు..
ఆపరేటర్లతో డాటా ఎంట్రీ
చేయించాలని ఆదేశం
జిల్లాలో ప్రారంభమైన సర్వే
వివరాల నమోదు
ఏర్పాట్లు చేశాం
సమగ్ర సర్వే వివరాల డాటా ఎంట్రీకి ఏర్పా ట్లు చేశాం. అందుబాటులో ఉన్న ఆపరేటర్ల తో పాటు బయటవారిని నియమించి డా టా ఎంట్రీ ప్రాంభించాం.మోర్తాడ్ డిగ్రీ కళా శాల లో కూడా డాటా ఎంట్రీకి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఆపరేట్లకు శిక్షణ ఇచ్చారు. ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్ నమోదు పూర్తి చేస్తాం. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment