డీసీఈబీ అవినీతి మయం
నిజామాబాద్ అర్బన్: జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (డీసీఈబీ) అవినీతి మయంగా మారింది. విద్యార్థులకు ప్రశ్నపత్రాల తయారీ, మెరుగైన ఫలితాలు తీసుకు రావడంలో కీలకపాత్ర వహించే ఈ విభాగంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించక పోవడంతో ఈ విభాగం దారి తప్పింది. ప్రశ్నపత్రాల తయారీ, ప్రైవేటు పాఠశాలలకు అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. తప్పుడు బిల్లులు సైతం లేపుకుంటున్నట్లు తెలుస్తోంది.
● సమ్మెటీవ్–1, సమ్మెటీవ్–2 పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ డీసీఈబీ రూపొందించిన ప్రశ్న పత్రాలను అందించాలి. విద్యార్థులకు డీసీఈబీ రూపొందించిన ప్రశ్నావళితోనే సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహించాలి. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సొంతంగా తయారు చేసిన ప్రశ్నవళితోనే సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కాగా, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారు. డీసీఈబీ రూపొందించిన ప్రశ్నపత్రాలను నామమాత్రంగా ప్రైవేటు పాఠశాలలకు అందిస్తున్నారు. అధికారులు ఈ సందర్భంగా ప్రశ్న ప్రతాల ముద్రణ తక్కువ కాపీలు చేయిస్తున్నారు. బిల్లులు మాత్రం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ ప్రశ్న పత్రాలు అందించినట్లు రూపొందించి క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇటీవల డీసీఈబీ అధికారి ఒకరు రూ. 8 లక్షల బిల్లులు లేపుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రశ్న పత్రాల తయారీ కోసం డీసీఈబీకి ప్రతి ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల బడ్జెట్ మంజూరు అవుతుండగా, తప్పుడు బిల్లులతో నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
ప్రశ్నపత్రాల తయారీలో తప్పుడు బిల్లులు
సొంతంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటున్న ప్రైవేటు పాఠశాలలు
పట్టించుకోని సంబంధిత అధికారులు..
అక్రమాలపై విచారణ జరపాలి
డీసీఈబీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రశ్నపత్రాలు అందించకపోవడం సమంజసం కాదు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాలి – రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
చర్యలు తీసుకుంటాం
జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.అక్రమాలు జరిగినట్లయితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ప్రశ్నపత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపడుతాం. ఎలాంటి అక్రమాలు జరుగకుండ చర్యలు తీసుకుంటాము. – అశోక్, డీఈవో
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1234 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్ష 48 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య లక్ష 20 వేల 863 వరకు ఉంటుంది. జిల్లా ఉమ్మ డి పరీక్షల విభాగం సమ్మెటీవ్–1, సమ్మెటీవ్–2 , ఫార్మట్ పరీక్షలను నిర్వహించేందుకుగాను ప్రశ్నపత్రాల తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రశ్న పత్రాలను ఈ విభాగం నుంచే పంపిణీ చేస్తారు. వీరు తయారు చేసిన ప్రశ్న పత్రాల ఆధారంగానే పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఇందుకు గాను ప్రభు త్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులు ఒక్కొక్కరికి నుంచి రూ.100, 9వ తరగతి విద్యార్థుల నుంచి రూ.90 చొప్పు వసూలు చేస్తారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థుల నుంచి రూ.100 చొప్పున , 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల నుంచి రూ.60 చొప్పున వసూలు చేస్తారు. ఈ బడ్జెట్‌తో ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్షల నిర్వహణకు అందిస్తారు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment