ధనుస్సు
రామబాణం..
కిలో బంగారం, 13 కిలోల వెండితో తయారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అయోధ్య పుణ్యభూమిలో అయోధ్య–భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ద్వారా గత ఏడాదిన్నరగా ప్రతిరోజూ అన్నదానం చేస్తూ.. బాలరాముడి సేవలో తరిస్తున్న జిల్లా వాసి దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాల పర్యటన చేస్తున్నారు. జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి అనే భక్తుడు 1 కిలో బంగారం, 13 కిలోల వెండితో చైన్నెలో తయారు చేయించిన రామబాణం, ధనుస్సును దేశంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో, మఠాల్లో, పీఠాల్లో ఉంచి ప్రధాన అర్చకులు, మఠాధిపతులు, పీఠాధిపతులతో ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నారు. ఈ ధనుస్సు, బాణాన్ని 2025 ఏప్రిల్ 6న అయోధ్య బాలరాముడి ఆలయానికి అప్పగించనున్నారు. రాముడి 14 సంవత్సరాల వనవాసానికి గుర్తుగా 14 కిలోల ధనుస్సు, బాణం తయారు చేయించినట్లు శ్రీనివాస శాస్త్రి చెబుతున్నారు. శుక్రవారం ఇందూరు నగరంలోని సుభాష్‌నగర్ రామాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సరళ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వీటిని ఉంచి పూజలు చేశారు. భక్తులు దర్శించుకున్నారు.
అయోధ్యలో భారీ ఆలయం..
అయోధ్య నగరంలో అయోధ్య–భాగ్యనగర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాముడు పుట్టిన సూర్య వంశం (బ్రహ్మ నుంచి మొదలు), సీతామాతకు చెందిన చంద్ర వంశం పురుషులతో, అదేవిధంగా సప్తరుషుల విగ్రహాలతో మొత్తం 400 పైగా విగ్రహాలు ఏర్పాటు చేసేలా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను రాముడు అయోధ్య నుంచి వనవాసం కోసం బయటకు వచ్చిన ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తమిళనాడులోని మహాబలిపురంలో విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. ఇప్పటికే 50 పైగా విగ్రహాలు తయారైనట్లు శ్రీనివాస శాస్త్రి తెలిపారు.
● శ్రీనివాస శాస్త్రి గతంలో 1 కిలో బంగారం, 8 కిలోల వెండితో శ్రీరాముడి పాదుకలను హైదరాబాద్‌లో తయారు చేయించారు. (వెండి పాదుకలకు బంగారు తొడుగు ఉంచుతారు). వెండి పాదుకలను శిరస్సుపై పెట్టుకుని శ్రీనివాస శాస్త్రి అయోధ్యలో 41 రోజుల పాటు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తర్వాత ప్రతి నెల 15 రోజుల పాటు ఈ పాదుకలతో దేశవ్యాప్తంగా పర్యటించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని పుణ్యనదుల్లో పాదుకలకు స్నానం చేయించారు. అదేవిధంగా శృంగేరి, కంచి, తిరుమల, పుష్పగిరి, ఉడిపి, పూరి, మైసూరు గణపతి సచ్చిదానంద, జీయరుస్వామి పీఠాల్లో పాదుకలకు ప్రత్యేకంగా ఆయా పీఠాధిపతులు పూజలు చేశారు.
ఈ క్రమంలో శ్రీనివాస శాస్త్రి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు త్రేతాయుగంలో ‘శ్రీరాముడు నడయాడిన’ దారిలో (రామేశ్వరం–కిష్కింద(కర్ణాటకలోని రుష్యమూక పర్వతం –భద్రాచలం–కందకుర్తి–బాసర–మహోర్‌గఢ్–ఉన్కేశ్వర్–చిత్రకూట్ (మధ్యప్రదేశ్) మీదుగా అయోధ్యకు పాదుకలతో పాదయాత్ర చేశారు.
● శ్రీనివాస శాస్త్రి తయారు చేయించిన 5 వెండి ఇటుకలనే ఆయల శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉపయోగించడం విశేషం. ఒక్కో ఇటుకను 2.5 కిలోల వెండితో తయారు చేశారు. 2019లో రామజన్మభూమి విషయమై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక అయోధ్య రాజకుటుంబీకుడు బిమలేంద్రసింగ్ మిశ్రా సమక్షంలో అయోధ్య కలెక్టర్‌కు మొదటి ఇటుకను అందజేశారు. తరువాత 2020 ఆగస్టు 2వ తేదీన మిగిలిన 4 ఇటుకలను తయారు చేశారు.
సుభాష్‌నగర్ రామాలయంలో
దర్శించుకున్న భక్తులు
రామబాణం, ధనుస్సుతో దేశవ్యాప్తంగా జిల్లా భక్తుడి యాత్ర
2025 ఏప్రిల్ 6న అయోధ్య
ఆలయానికి అప్పగించనున్న
శ్రీనివాస శాస్త్రి
గతంలో పాదుకలతో రామేశ్వరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment