పశుగణనకు సన్నద్ధం
● జిల్లాలో పశుగణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు
● 109 మంది ఎన్యుమరేటర్‌లు,
22 మంది సూపర్‌వైజర్ల నియామకం
● ఫిబ్రవరి నెలాఖరు వరకు
కొనసాగనున్న ప్రక్రియ
నాగిరెడ్డిపేట: జిల్లాలో జీవాల లెక్కను తేల్చేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఐదేళ్లకోకసారి పశుగణన ప్రక్రియ చేపడతారు. గతంలో 2018లో 20వ పశుగణన చేశారు. తిరిగి 2023లో పశుగణన చేపట్టాల్సి ఉండగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో అప్పుడు జరపలేదు. ఈ క్రమంలో ఈ యేడు 21వ అఖిల భారత పశుగణన చేపట్టేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గణన ప్రక్రియ చేపట్టే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడ ఇచ్చారు. కాగా జిల్లాలో గల 485రెవెన్యూ గ్రామాల ఆధారంగా పశుగణన ప్రక్రియ చేపట్టనున్నారు. కామారెడ్డి జిల్లాలో పశుగణన ప్రక్రియ చేపట్టేందుకు 109మంది ఎన్యుమరేటర్‌లతోపాటు 22మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఎన్యుమరేటర్‌గా నియమితులైన వారిలో అటెండర్ స్థాయి నుంచి గోపాలమిత్రలతోపాటు ఇతర సిబ్బంది ఉన్నారు. వీరందరికీ విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో పశువుల లెక్కింపు, యాప్ వినియోగంతీరు, సేకరించిన సమాచారం ఆన్‌లైన్‌లో నమోదుచేసే తీరును గురించి శిక్షణలో వారికి వివరించారు.
టీకాలతో ఆగిన ప్రక్రియ
జిల్లాలో పశుగణన ప్రక్రియ నాలుగు నెలలపాటు కొనసాగనుంది. జిల్లాలో అక్టోబర్ 25న పశుగణన ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పశువులకు గాలికుంటు టీకాలు వేసే క్రమంలో గణన ప్రక్రియకు కొంత అంతరాయం ఏర్పడింది. తిరిగి రెండురోజుల క్రితం పశుగణన ప్రక్రియ మొదలయింది. ఫిబ్రవరి 28వ తేది వరకు జిల్లాలో పశుగణన ప్రక్రియ జరగనున్నట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.
డిజిటల్ విధానంలో..
జిల్లాలో చేపట్టిన పశుగణన ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా గణన ప్రక్రియ చేపట్టనున్నారు. గణనలో భాగంగా సేకరించిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తూ ప్రక్రియను కొనసాగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment