శిశుగృహకు పసికందు అప్పగింత
నవీపేట: మండలంలోని అంజుమాన్ ఫారమ్ గ్రామానికి చెందిన మహిళ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన రెండు నెలల పసికందును ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం శిశుగృహకు అప్పగించారు. గ్రామానికి చెందిన శారదకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు బుధవారం నుంచి రెండు నెలల పసికందు కనిపించింది. అనుమానం వచ్చిన అంగన్‌వాడీ టీచర్ స్వప్న పాప గురించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పసికందును స్వా ధీనం చేసుకొని శిశుగృహకు అప్పగించారు.
వేతనాలు
చెల్లించాలని వినతి
సుభాష్‌నగర్: మండలంలోని గ్రామ పంచాయతీ కారోబార్లు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని కారోబార్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. ఇతర ఖర్చుల కింద వాడుకున్నారని డీపీవో దృష్టికి తెచ్చారు. డీటీఓలో చెక్కులు జమ చేశారని చెప్తున్నా.. ఇప్పటివరకూ క్లియరెన్స్ కాలేవని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి తమకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కారోబార్లు అరుణ్, శ్రీనివాస్, సావిత్రి, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.
1న మాస్టర్
అథ్లెటిక్స్ పోటీలు
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనునాయక్, కార్యదర్శి బద్దం గోపిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మెన్, ఉమెన్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. 100 మీటర్ల రన్నింగ్, 200 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్, 5 కిలో మీటర్ల రన్నింగ్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉంటుందని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్ కుమార్(9440007576), జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిరెడ్డి (9949585065)ని సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment