బాధిత కుటుంబాలకు భరోసా
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు భరోసా లభించింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు మరణించిన మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల చొప్పున జమ చేస్తుంది. రెండు నెలల కింద గల్ఫ్ మృతులకు సాయం ప్రకటించి నెల రోజుల కిందనే నిధులను విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సాయం కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరిహారం జమ చేయడంలో జాప్యం జరిగింది. వేములవాడలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 37 కుటుంబాలకు రూ.1.85 కోట్ల సాయంను జమ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఆమోదంతోనే గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం మంజూరు అవుతుంది. జిల్లాలో తొలి విడతలో 35 కుటుంబాలకు పరిహారానికి సంబంధించిన ప్రోసిడింగ్‌లను అందించారు. బుధవారం మరో రూ.10లక్షలను విడుదల చేయగా ఇటీవల మరణించిన ఇద్దరు మృతుల కుటుంబాలకు సాయం అందనుంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. వైఎస్ మరణం తర్వాత గల్ఫ్ ప్రవాసుల సంక్షేమంపై ఎవరు దృష్టి పెట్టలేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం మంజూరు చేస్తోంది. ఇది ఇలా ఉండగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించే విషయంలో కటాఫ్ తేదిని సవరించాలనే డిమాండ్ వినిపిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకే సాయం అందించడంతో గతంలో మరణించిన వారి కుటుంబాలు నష్టపోతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా సాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గల్ఫ్ మృతుల కుటుంబాల ఖాతాల్లో రూ.ఐదు లక్షలు
జమ చేస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 37 కుటుంబాలకు రూ.1.85 కోట్లు
ఎంతోమందికి ప్రయోజనం
గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం అందించడంతో ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది. రూ.ఐదు లక్షల సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గల్ఫ్ బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాయి.
– తక్కూరి సతీష్, కాంగ్రెస్ నాయకుడు, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment