చిన్నారిని మింగిన డ్రైనేజీ
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణం 35వ వార్డు పరిధిలోని రాంనగర్‌లో ఏడు ఫీట్ల లోతైన డ్రైనేజీలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.
రాంనగర్‌లో నివసిస్తున్న ఆటో డ్రైవర్ మట్ట ప్రశాంత్, జ్యోతి దంపతుల కూతురు ధన శ్రీ గురువారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటూ డ్రైనేజీలో పడిపోయింది. పాప కనపడక పోయేసరికి కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికారు. చివరకు కాలనీవాసులు డ్రైనేజీలో బుడగలు వస్తుండడం గమనించి వెతకగా చిన్నారి మృత దేహం లభ్యమైంది. ఉన్నఫలంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ధనశ్రీ పెళ్‌లైన 12 సంవత్సరాలకు జన్మించిన ఏకై క సంతానం కాగా దంపతుల రోదనలు మిన్నంటాయి. అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన మున్సిపల్ అధికారులతో కాలనీవాసులు వాగ్వాదం పెట్టుకున్నారు. కాలనీలో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీపై రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. చిన్నారి మృతికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. వెంటనే డ్రైనేజీ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నగరంలో మృత్యు కుహరాలు
నిజామాబాద్ సిటీ : ఇందూరు నగరంలోని పలు డ్రైనేజీలు, నాలాలు మృత్యు కుహరాలుగా మారాయి. వర్షాకాలంలోనైతే నాలాల పక్కన నివసించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. నాలాలు, డ్రైనేజీలు ఎవరిని మింగేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. గతంలో గౌతంనగర్ వద్ద ఓ బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆగష్టు 20న ఆర్‌ఆర్ చౌరస్తా సమీపంలోని ఆనంద్ నగర్ కాలనీలో అనన్య అనే రెండేళ్ల బాలిక ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడిపోయి ప్రాణాలు విడిచింది. అంబేద్కర్ కాలనీలో డ్రెనేజీలోపడి ఓ యువకుడు మృతి చెందాడు. చంద్రనగర్‌లో సైతం ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
డ్రైనేజీల మీదనే నివాసాలు..
నగరంలోని పలు నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ఫులాంగ్ వాగుతో పాటు డి–52, డి–57 కెనాల్‌ల మీద పలువురు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న గదులు నిర్మించారు. బాత్‌రూమ్‌లతోపాటు చిన్నపాటి కిరాణా దుకాణాలు, మటన్, చికెన్, కూరగాయల దుకాణాలు వెలిశాయి. అహ్మద్‌పురా కాలనీ, మాలపల్లి, నిజాంకాలనీ, అంబేద్కర్‌కాలనీ, కెనాల్‌కట్ట వంటి పలు చోట్ల ఆక్రమణలున్నాయి. అయినా బల్దియా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదాలు నివారించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment