ఫలితాల కోసం ఎదురుచూపు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీలో కీలకమైన యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల కోసం గత రెండున్నర నెలలుగా ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం ఉత్సాహంగా ఉంటూ, భావి నాయకులుగా ఎదగాలనుకునే యూత్ కాంగ్రెస్ నాయకులు కీలకమైన పదవుల కోసం పోటీ పడ్డారు. ఈ పదవుల కోసం బరిలో నిలిచేవారు ఆన్‌లైన్‌లోనే నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా సభ్యత్వాలు, ఓటింగ్ ప్రక్రియ సైతం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, నియోజకవర్గ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు పదవులకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే ఓట్లు వేశారు. సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి మొత్తం 6 ఓట్లు వేయాలి. గత జూలై 23న నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తరువాత నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. స్క్రూటినీ ఆలస్యం కావడంతో పార్టీ శ్రేణులు ఫలితాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని వ్యవహారాలను, ప్రక్రియను ఢిల్లీలోని పార్టీ ఎన్నికల పర్యవేక్షణ విభాగం పర్యవేక్షించింది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి మాత్రమే యువజన కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు పోటీ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ ఫలితాల విషయమై ప్రధాన పార్టీ నాయకులు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
● నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం విపుల్‌గౌడ్ (నిజామాబాద్ అర్బన్), అబ్దుల్ అద్నాన్ (నిజామాబాద్ అర్బన్), సాయికిరణ్ (నిజామాబాద్ రూరల్), శ్రీకాంత్ (ఆర్మూర్), నరేష్ (నిజామాబాద్ రూరల్), నాగేంద్రబాబు (బాల్కొండ) పోటీ పడ్డారు. అయితే వయస్సు 35 సంవత్సరాలు పైబడి ఉందన్న కారణంతో నరేష్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్లు తెలిసింది. అదేవిధంగా నాగేంద్రబాబు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయనే విషయమై ఫిర్యాదులు వెళ్లడంతో అతని అభ్యర్థిత్వాన్ని సైతం హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. కాగా జిల్లాలో 40 వేలకు పైగా సభ్యత్వాలు, ఓటింగ్ నమోదైనట్లు అంచనా. ఇదిలా ఉండగా కీలకమైన యువజన కాంగ్రెస్‌లో పనిచేసినవారికి భవిష్యత్తులో పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉండడంతో ఈ పదవులకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో నియోజకవర్గ, మండల అధ్యక్ష పదవులకు సైతం ఆన్‌లైన్ ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జిల్లా అధ్యక్ష అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఎక్కువగా ఉంది. రెండుమూడు రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్‌లోనే జరిగిన యువజన
కాంగ్రెస్ సభ్యత్వం, నామినేషన్లు,
ఓటింగ్ ప్రక్రియ
స్క్రూటినీ ఆలస్యం..
రెండున్నర నెలలుగా
తప్పని నిరీక్షణ
రెండుమూడు రోజుల్లో
విడుదల కానున్న ఫలితాలు!
Comments
Please login to add a commentAdd a comment