నిజామాబాద్‌అర్బన్ : విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆహార భద్రత కమిటీలను నియమించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల, వసతి గృహాల ఇన్‌చార్జీలు ఆహార భద్రత కమిటీలను నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీలు పని చేయనున్నాయి. కమిటీలో హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌లతోపాటు అదే సంస్థలో పని చేసే మరో ఇద్దరు సిబ్బంది ఉంటారు. అలాగే మండలాలు, డివిజన్‌లతోపాటు జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కోసం కలెక్టర్ నోడల్ అధికారులను నియమిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణలో ఆహారభద్రత కమిటీలు పని చేయనున్నాయి.
జిల్లాలో విద్యాసంస్థలు
జిల్లాలో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు 1039 ఉండగా, 81771 మంది విద్యార్ధులు, రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన 112 పాఠశాల్లో 13,376 మంది, రాష్ట్ర విభాగం ప్రత్యేక విభాగానికి చెందిన ఐదు పాఠశాలల్లో 142 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
పకడ్బందీగా అమలు చేస్తాం
ఆహారభద్రత కమిటీలను పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేస్తామని నిజామాబాద్ సౌత్ ఇన్‌చా ర్జి ఎంఈవో సాయారెడ్డి అన్నారు. భోజనం రుచి చూసిన తరువాతనే విద్యార్థులకు వడ్డిస్తారన్నారు.
విద్యార్థుల కోసం వంట చేసే ముందు స్టోర్ రూమ్, కిచెన్‌లను తనిఖీ చేయాలి.
పరిశుభ్రత,భోజనం నాణ్యతను నిర్ధారించాలి.
ఆహార నాణ్యతను తనిఖీ చేయడంతోపాటు విద్యార్థులకు వడ్డించే ముందు రుచి చూడాలి.
రోజువారీ ఫొటోలు, వివరాలను రికార్డు చేసి ఉంచాలి.
మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చే వరకు తేదీ వారీగా ఫొటోలు, వివరాలను తమ వద్ద ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment