ఇందూరు సేవలు
● ప్రయాగ్‌రాజ్‌లో అన్నదాన సేవలు
ప్రారంభించిన శ్రీరామానందాచార్య
ఆశ్రమం, శ్రీసీతారాంధాం సంత్
సేవాశ్రమం
● ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి తదితరుల సహకారం
● కుంభమేళా వద్ద ప్లాస్టిక్ నియంత్రణకు
ఆర్‌ఎస్‌ఎస్‌కు సహకరించిన
జిల్లావాసులు
● జిల్లా నుంచి పుణ్యస్నానాలకు
వెళ్లనున్న భక్తులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహా కుంభమేళా ప్రపంచంలో అతిపెద్ద క్రతువుగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ క్రతువులో దేశం నలుమూలల నుంచి అనేకమంది అనేక సంస్థల ద్వారా అన్నదానం సహా ఇతర సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇందూరు జిల్లాకు చెందిన సారంగపూర్‌లోని శ్రీరామానందాచార్య ఆశ్రమం పూర్వ పీఠాధిపతి మహంత్ శ్రీరమాపతి దాస్‌జీ శాస్త్రి, ప్రస్తుత పీఠాధిపతి మంగళదాస్‌జీ మహరాజ్ ఆధ్వర్యంలో, కందకుర్తిలోని శ్రీసీతారాంధామ్ సంత్ సేవాశ్రమం పీఠాధిపతి సీతారాం త్యాగి ఆధ్వర్యంలో ప్రయాగ్‌రాజ్‌లో 42 రోజుల పాటు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించేందుకు లంగర్లు వేసుకున్నారు. ఈ ఆశ్రమాల ద్వారా అందిస్తున్న సేవలకు గాను జిల్లా నుంచి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అందరికంటే ముందుగా స్పందించారు. భారీ సహకారం అందించారు. తరువాత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పలువురు వ్యాపారులు ఆర్థిక సహాయం అందించారు. వీరే కాకుండా ధన, వస్తు రూపేణా జిల్లా నుంచి పలువురు భక్తులు సైతం సహకరించారు. ఇక నగరానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా ఉత్తరప్రదేశ్‌లోని కాశీ మోక్షదాయక్ ట్రస్ట్‌కు తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ప్రయాగ్‌రాజ్‌లో అన్నదానం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ‘తాలి జౌర్ తైల్’ నినాదంతో కుంభమేళా వద్ద ప్లాస్టిక్ నియంత్రణకు కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా సాధువులకు స్టీల్ ప్లేట్లు, వస్త్ర సంచి అందించేందుకు జిల్లా నుంచి పలువురు తమవంతుగా విరాళాలు అందించడం విశేషం.
● సనాతన హిందూ ధర్మంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలో కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రస్తుత కుంభమేళా ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నేపథ్యంలో కుంభస్నానం ప్రారంభమవుతుంది.
ప్రస్తుత కుంభమేళాలో జనవరి 13న (పౌష్య పూర్ణిమ), జనవరి 14న(మకర సంక్రాంతి), జనవరి 29న(మౌని అమావాస్య), ఫిబ్రవరి 3న(వసంత పంచమి), ఫిబ్రవరి 12న(మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26న(మహా శివరాత్రి) రోజున చేసే స్నానాలను ‘రాజ స్నానాలుగా’ పిలుస్తున్నారు. ఈ ఆరు దినాల్లో చేసే స్నానాలకు సాధువులు, నాగసాధువులు దేశం నలుమూలల నుంచి వస్తారు. అంతరిక్షం నుంచి చూసినప్పటికీ ఈ కుంభమేళా కనిపిస్తుండడం విశేషంగా చెబుతారు. గంగ, యమున, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదులు కలిసే ప్రయాగ్‌రాజ్ వద్ద చేసే స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment