ఆర్టీసీకి పండుగ తెచ్చిన సంక్రాంతి
ఖలీల్‌వాడి: ఆర్టీసీకి పండుగను తెచ్చింది సంక్రాంతి పర్వదినం. సంక్రాంతి సందర్భంగా అదనపు బస్సులు నడపిన ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చాయి. ఈనెల 9నుంచి 20వరకు సాధారణ బస్సులతో పాటు 444 అదనపు బస్సులను నడిపించగా ప్రయాణికుల రద్దీని బట్టి మళ్లీ అదనంగా 124 బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో సాధారణ, ప్రత్యేక బస్సులతో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో రోజువారి ఆదాయంతోపాటు అదనంగా రూ.15లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
2.30లక్షల కిలోమీటర్లు..
ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల నుంచి 568 బస్సులను ఈనెల 9నుంచి 20వరకు నడపగా, ఈ బస్సులు 2.30లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. ప్రత్యేక బస్సుల్లో మొత్తం లక్ష మందికి పైగా ప్రయాణించగా, వీరిలో మహాలక్ష్మి ప్రయాణికులు సుమారు 60 వేలకు మంది ఉన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. నిజామాబాద్–జేబీఎస్, జేబీఎస్–నిజామాబాద్, ఆర్మూర్–జేబీఎస్, జేబీఎస్–ఆర్మూర్, కామారెడ్డి–జేబీఎస్, జేబీఎస్–కామారెడ్డి, నిజామాబాద్–వరంగల్, కరీంనగర్, వరంగల్, కరీంనగర్–నిజామాబాద్, బాన్సువాడ–మెదక్, మెదక్–బాన్సువాడలకు ఈ బస్సులను నడిపించారు. అలాగే వింజమూరుకు సైతం బస్సులను నడిపించారు. దీంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 1056 గ్రామాలకు బస్సులు యథావిధిగా నడిపించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల చర్యలు చేపట్టాం. ముందస్తుగా అదనపు బస్సులను ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు బస్సుల కంటే ఎక్కువగా నడిపించాం. సర్వీసులను ప్రణాళికతోపాటు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించాం. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం 444అదనపు సర్వీసులకు మరో 128 బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాం.
– సరస్వతి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం,
నిజామాబాద్
ఉమ్మడి జిల్లాలో పండుగ వేళ
568 ప్రత్యేక బస్సుల ఏర్పాటు
11 రోజులలో ఆర్టీసీకి
రూ.1.73 కోట్ల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment