No Headline
నిజామాబాద్‌అర్బన్: నాలుగు పథకాలకు సంబంధించి జిల్లాలో నిర్వహించిన వార్డు, గ్రామ సభలు మంగళవారం మొదటి రోజు నిరసనలు, నిలదీతల మధ్య జరిగాయి. వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్న వారు తమ పేర్లు నివేదికలో ఎందుకు లేవని అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సభలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు విడతలుగా జరిగాయి. సభల నిర్వహణను క్లస్టర్‌గా విభజించి ప్రత్యేక అధికారులను నియమించారు. మొదటి రోజు 160 గ్రామ పంచాయతీలు, 40 మున్సిపల్ వార్డుల్లో మొత్తం 200 ప్రాంతాల్లో సభలు జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇందల్వాయి మండలం, అదనపు కలెక్టర్ అంకిత్ నవీపేట మండలంలో, ఇతర అధికారులు వివిధ మండలాల్లో సభలకు హాజరయ్యారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామ సభలో జెడ్పీ సీఈవో సాయన్న, రాంపూర్ గ్రామ సభలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
నిలదీతలు..
నందిపేట మండలం కుద్వాన్‌పూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఎదుట మహిళలు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి పది ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని నిలదీశారు. వార్డు, గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ , పేర్ల నమోదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు అర్హుల ఎంపికకు ప్రజాపాలనలో అధికారులు స్వీకరించిన దరఖాస్తుల ప్రకారం పరిశీలన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సభల్లో ఆయా పథకాలకు దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలను సభలో అధికారులు ప్రకటించారు. అయితే చాలా మంది పేర్లు అధికారుల నివేదికలో లేవు. దీంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కూడా తమ పేర్లు ఎందుకు నమోదు చేయలేదని ప్రజలు చాలా చోట్ల అధికారులను నిలదీశారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి పేర్ల నమోదు ప్రక్రియలో చాలా చోట్ల దరఖాస్తు దారుల వివరాలు గల్లంతయ్యాయి. కొని చోట్ల ప్రజాపాలన దరఖాస్తులు కూడా అధికారులను లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇందులో మొదటి రోజు 16 వార్డు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకుగాను ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని 21, 41 డివిజన్‌లలో జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టారని ఆరోపించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్ పల్లి, సిరికొండ మండలాల్లో సభలు రసాభాసగా కొనసాగాయి. అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో రాలేదని, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద వ్యాపారుల పేర్లు మాత్రం లబ్ధి దారుల జాబితాలో ఎలా వస్తాయని పలు గ్రామా ల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు.
గ్రామ సభలు గరం గరం
నిరసనలు.. నిలదీతలు
సంక్షేమ పథకాల జాబితాలో పేర్ల
గల్లంతుపై దరఖాస్తుదారుల ఆందోళన
ఎన్నికల హామీ నెరవేర్చలేదని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో మహిళల వాగ్వాదం
గాదెపల్లిలో సభ బహిష్కరణ
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం సభలలో దరఖాస్తుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బోధన్, సాలూర, ఎడపల్లి, రెంజల్, నవీపేట, రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, మోస్రా, చందూర్ మండలాల్లోని గ్రామాల్లో ప్రజా పాలన గ్రామ సభలు అసంతృప్తి మధ్య కొనసాగాయి. బోధన్, వర్ని మండలాల్లోని ఐదు గ్రామాల్లో, మోస్రా, చందూర్ మండలాల్లోని ఒక్కొక్క గ్రామంలో, మిగిలిన మండలాల్లో మూడు గ్రామాల చొప్పున గ్రామసభలు జరిగాయి. బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన సభలు సాదాసీదాగా జరిగాయి. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. సర్వే చేసి, ఫొటోలు తీసుకున్నారని అధికారులకు మొరపెట్టుకున్నారు.
డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామంలో అర్హులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదని నిరసిస్తూ గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. అనంతరం గ్రామ సెక్రెటరీకి వినతిపత్రం సమర్పించారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం తాళ్లపల్లిలో గ్రామ సభ నిర్వహించగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే లబ్ధిదారుల జాబితాలో అర్హులకు స్థానం లభించలేదని పలువురు ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment