ఎర్రజొన్న ధరకు సిండికేట్ కళ్లెం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన రైతు బూత్‌పురం మహిపాల్ తన వ్యవసాయ భూమిలో సాగు చేసిన ఎర్రజొన్నలను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. క్వింటాల్‌కు రూ.700 వరకు ధర తగ్గించడంతో ఎర్రజొన్నలను నిలువ చేసుకుని ధర లభించిన సమయంలోనే విక్రయించాలని అనుకుంటున్నాడు.
ఇది ఒక్క రైతు మహిపాల్ నిర్ణయమే కాదు. ఎర్రజొన్నలను సాగు చేసిన అనేక మంది రైతులు పంటను నిలువ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో క్వింటాల్ ఎర్రజొన్నలకు రూ.4,500 ధర లభించగా ఈసారి మాత్రం రూ.3,800కు మించి ధర లేదని వ్యాపారులు చెబుతుండగా.. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. సీడ్ పంట సాగు, ధర నిర్ణయం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేకపోవడంతో రైతులు సీడ్ వ్యాపారులనే నమ్ముకోవాల్సి వస్తోంది. జొన్నల సాగు విషయంలో బైబ్యాక్ ఒప్పందాలు లేకుండా ఎవరూ పంట సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ ప్రచారం నిర్వహించింది. రైతులు మాత్రం పంట సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ధర పెరుగుతుందనే ధీమాతో ఎర్రజొన్నలను సాగు చేశారు.
బళ్లారితో పోలిస్తే భిన్నమైన పరిస్థితులు
కర్ణాటకలోని బళ్లారిలో ఎర్రజొన్న సాగవుతోంది. అక్కడి రైతులు నిజామాబాద్ జిల్లాలో కన్నా ముందే పంట సాగు చేయడం, కోతలు పూర్తి చేయడం చేస్తారు. బళ్లారి పంటకు ఇక్కడి పంటకు నాణ్యతలో ఎంతో తేడా ఉంటుంది. అందుకే అక్కడికంటే ఎక్కువ ధర మన పంటకు లభిస్తుంది. బళ్లారిలో క్వింటాల్ ఎర్రజొన్నలను అక్కడి రైతులు రూ.3,800కు విక్రయించారు. ఈ లెక్కన మన ప్రాంతంలోని పంటకు రూ.4వేలకు మించి ధర లభించాలి. గతంలోనూ బళ్లారి ధరకు ఇక్కడి ధరకు రూ.200 నుంచి రూ.500 వరకు తేడా ఉంది. ఈసారి మాత్రం అక్కడి ధరనే వర్తింపజేయాలని వ్యాపారులు నిర్ణయించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సీడ్ వ్యాపారులు ధరను తగ్గించి ఎక్కువ లాభం పొందాలను చూస్తున్నారని రైతులు ఐక్యంగా ఉంటే ధర ఖచ్చితంగా లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కటైన వ్యాపారులు
నిలువ చేసేందుకే రైతుల ప్రాధాన్యం
గతంతో పోలిస్తే క్వింటాల్‌కు
రూ.700 తగ్గిన ధర
తీవ్రంగా నష్టపోతున్నామని
వాపోతున్న రైతులు
నష్టపరచాలని చూస్తున్నారు
సీడ్ వ్యాపారులు రైతులను నష్టపర్చాలని చూస్తున్నారు. పంటల సాగు ఖర్చులు పెరుగుతుంటే ధర తగ్గించి లాభం లేకుండా చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్‌ను కట్టడి చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. రైతుల శ్రమను దోచుకునేవారికి బుద్ధి చెప్పాలి.
– కుంట రవిశంకర్ రెడ్డి, రైతు, పాలెం
Comments
Please login to add a commentAdd a comment