డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని మారంపల్లిలో ఇటీవల సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ నరేశ్ సమక్షంలో సోమవారం వేలం వేశారు. మొత్తం 16 ట్రాక్టర్ల ఇసుక ఉండగా నలుగురు వ్యక్తులు వేలంలో పాల్గొన్నారు. ట్రాక్టర్‌కు రూ.1,210 చొప్పున పాటపాడి మారంపల్లికి చెందిన కాశపురం రవి ఇసుక డంప్‌ను దక్కించుకున్నారు. ఇసుక పట్టుబడిన రోజున అది తనదేని ముందుకు వచ్చిన వ్యక్తి వేలంలో ఇసుకను దక్కించుకున్న వ్యక్తి ఒక్కరే కావడం గమనార్హం. అతడి వద్ద ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఇసుకను వేలం వేయాల్సి వచ్చింది. వేలం ద్వారా సమకూరిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
రాజంపేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. లేత మామిడి తండా నుంచి ఇతర గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున దాడి చేసి ఇసుక తరలిస్తున్న నడిమితండాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేశామన్నారు. ఇసుక ట్రాక్టర్‌ను చాకచక్యంగా పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు సురేశ్, చరణ్‌ను ఎస్సై అభినందించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఖలీల్‌వాడి: నగరంలోని మారుతినగర్ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై దాడి చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య సోమవారం తెలిపారు. ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్‌లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకురాలితోపాటు ముగ్గురు బాధిత మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.3,660 నగదుతోపాటు నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం రూరల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
కోడి పందాల స్థావరంపై..
నవీపేట: మండలంలోని నాడాపూర్, కమలాపూర్ గ్రామాల మధ్య రహస్యంగా కొనసాగుతున్న కోడి పందాల స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై వినయ్ సోమవారం తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేశామని, రెండు కోడి పుంజులతోపాటు రూ.4,600 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇద్దరి బైండోవర్
భిక్కనూరు: పోలీసుల విధులకు అటంకం కలిగించడంతోపాటు తప్పుడు ప్రచారం చేస్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఈనెల 1న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఇల్లందుల ప్రభాకర్, ఇల్లందుల నరేశ్‌పై కేసు నమోదు చేశామన్నారు. వారిద్దరిని తహసీల్దార్ శివప్రసాద్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
స్నూకర్ సెంటర్‌ల తనిఖీ
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న స్నూకర్ సెంటర్‌లను ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. అనుమతి లేని స్నూకర్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడారు. స్నూకర్ సెంటర్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, గొడువలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment