‘కరెంటు బిల్లు పెండింగ్’ అనే మెసేజ్‌లతో వల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజల ఏమరుపాటును ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపీడీ పర్వంలో తాజాగా విద్యుత్ బిల్లుల పెండింగ్ అంశం చేరింది. గత ఏడాది చెదురుమదురుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచే సైబర్ నేరగాళ్లు పూర్తిగా ఇదే అంశంపై దృష్టి సారించినట్టు తాజాగా వస్తున్న ఫిర్యాదులు తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. గడచిన 50 రోజుల్లో జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఈ తరహా మోసాలు 40 వరకు చోటుచేసుకోవడం.. బాధితులు రూ.75 లక్షల వరకు నగదు పోగొట్టుకోడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా ముగ్గులోకి దింపుతారు..
విద్యుత్ వినియోగదారుల ఫోన్ నంబర్లు, వారి సర్వీస్ నంబర్లను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. వాటిలో బడా వ్యాపారుల నంబర్లను ఎంచుకుని.. ఆయా నంబర్లకు బిల్లు పెండింగ్ ఉందని, చెల్లించకపోతే వెంటనే సరఫరా నిలిపివేస్తామని మెసేజ్ పంపుతున్నారు. ఆ మెసేజ్ కింద ‘ఏఈ, విద్యుత్ శాఖ’ పేరిట ఓ ఫోన్ నంబర్ ఉంటోంది. దీనిని చూసిన వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌ను సంప్రదిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాడు వినియోగదారులను ముగ్గులోకి దించుతున్నాడు.
చెల్లించామని చెప్పినా..
అప్పటికే బిల్లు చెల్లించామని చెబితే.. విద్యుత్ శాఖ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని.. చెల్లించలేదని చెబితే యాప్‌లో వెంటనే చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. యాప్‌నకు సంబంధించిన వెబ్‌లింక్‌ను వాట్సాప్‌కు పంపుతారు. సదరు వెబ్‌లింక్ స్క్రీన్ షేరింగ్ యాప్స్ (టీం వ్యూవర్, ఎనీ డెస్క్, వైసుర–ఆండ్రాయిడ్ కంట్రోల్ ఆన్ పీసీ, స్కైప్, ఎయిర్ ఆండ్రాయిడ్, లెట్స్‌వ్యూ, జూమ్)కు సంబంధించినవి కావడంతో ఆ లింక్ క్లిక్ చేయగానే యాప్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఈ విషయం బాధితుడికి తెలియదు. ఆ తర్వాత మళ్లీ ఓ లింక్ పంపుతారు. బాధితుడు ఏ బ్యాంక్ ఖాతాదారుడు అయితే.. అదే బ్యాంక్‌కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ లింక్‌ను పంపుతారు. ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 తన ఖాతాకు బదిలీ చేస్తే విద్యుత్ శాఖ బిల్లుల చెల్లింపునకు యాప్ డౌన్‌లోడ్ అవుతుందని నమ్మిస్తారు. అప్పటికే స్క్రీన్ షేరింగ్ యాప్ బాధితుడి ఫోన్‌లో నిక్షిప్తం కావడంతో నెట్ బ్యాంకింగ్‌లో వినియోగదారుడు రూ.10 పంపే దృశ్యాన్ని సైబర్ నేరగాడు పూర్తిగా డెస్క్‌టాప్‌పై చూస్తాడు. బ్యాంకు ఖాతా నంబర్, పాస్‌వర్డ్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, క్రెడిట్ కార్డ్ వెనుక వైపున ఉండే గ్రిడ్ అంకెల వివరాలన్నీ సైబర్ నేరగాడు తెలుసుకుంటాడు. తద్వారా బాధితుడి అకౌంట్‌లోని నగదు మొత్తాన్ని కొట్టేస్తున్నారు.
రూటు మార్చి.. ఏమార్చుతున్న సైబరాసురులు బిల్లు వివరాలు అప్‌లోడ్ చేసుకోవాలంటూ మాయమాటలు స్క్రీన్ షేరింగ్ యాప్ లింకు పంపి డబ్బు కొట్టేస్తున్న వైనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వ్యాపారి ఫోన్‌కు ఫిబ్రవరి 15న ఓ మెసేజ్ వచ్చింది. కరెంటు బిల్లు పెండింగ్ ఉందని.. వెంటనే చెల్లించకపోతే ఆ రోజు రాత్రి 9 గంటలకు సరఫరా నిలిపివేస్తామనేది మెసేజ్ సారాంశం. విద్యుత్ శాఖ ఏఈ పేరుతో మెసేజ్ రావడంతో కంగారుపడిన సదరు వ్యాపారి మెసేజ్ అడుగున ఉన్న నంబర్‌కు కాల్ చేసి వారం క్రితమే బిల్లు కట్టేశామని చెప్పారు. యాప్‌లో నమోదు కాలేదని, వెంటనే నమోదు చేసుకోవాలని యాప్‌కు సంబంధించిన వెబ్ లింక్‌ను పంపించాడు. అవతలి వ్యక్తి మాటల్ని నిజమని నమ్మిన సదరు వ్యాపారి.. వాట్సాప్‌కు వచ్చిన వెబ్‌లింక్‌ను క్లిక్ చేశాడు. ఎలాంటి వివరాలు రాకపోవడంతో వ్యాపారి అవతలి వ్యక్తితో అదే విషయం చెప్పాడు. ఆ లింక్ అప్పుడప్పుడు సరిగ్గా పని చేయదని.. మరో లింక్ పంపుతానని చెప్పాడు. ఫోన్‌కు వచ్చిన మరో లింక్‌ను వ్యాపారి టచ్ చేయడంతో వెంటనే నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ఓపెన్ అయింది. అవతలి వ్యక్తి సూచన మేరకు రూ.10ని వ్యాపారి అతనికి పంపి.. యాప్‌లో వివరాలు నమోదయ్యాయని ఊపిరి పీల్చుకున్నాడు. మరుసటి రోజు వ్యాపార లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వెళ్లగా.. తన ఖాతాలోని రూ.14 లక్షలు, క్రెడిట్ కార్డులో రూ. 2.50 లక్షలు మాయమైనట్టు తెలిసి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
అప్రమత్తంగా ఉండండి
సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ ద్వారా పలు రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు. విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, బడా వ్యాపారస్తులు.. అన్నీ తెలిసిన వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదు. ఆ మెసేజ్‌లలో ఇచ్చిన వెబ్‌లింక్‌లను టచ్ చేయకూడదు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
– టి.కె. రాణా,
పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment