18న వీఆర్‌ఏల సామూహిక రాయబారం
కృష్ణలంక(విజయవాడతూర్పు): వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి ఈ నెల 18వ తేదీ చేపట్టిన సీసీఎల్‌ఏకు సామూహిక రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. నిబంధనలకు పాతరేసి వీఆర్‌ఏలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిన చట్టవిరుద్ధమైన నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపు డ్యూటీలు, రైస్ మిల్లు డ్యూటీలు వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ మాదిరిగా పేస్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్లు, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించడం తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొంది. రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీ సాహెబ్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. నెలకు వచ్చే రూ.10,500 జీతంతో వీఆర్‌ఏల కుటుంబాలు గడవక పస్తులతో రోజులు నెట్టుకొస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు అందరూ ఐక్యమై జీతాల పెంపు, చట్ట విరుద్ధమైన డ్యూటీల రద్దు, ప్రమోషన్లు, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించే వరకు రాజీలేని పోరాటం చేయాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్‌ఏల జీతాలను రూ.15 వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్‌ఏల జీతాల పెంపునకు సానుకూల నిర్ణయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు త్రినాథ రావు, గట్టు వెంకన్న, కొండబాబు, ఈశ్వరరావు, బాజీ బాబు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుట్టు వెంకన్న
విజయనగరంజిల్లాకు చెందిన గట్టు వెంకన్నను రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వీఆర్‌ఏల సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న టి.అంజి వ్యక్తిగత పోకడలతో, సంఘ విచ్ఛిన్నానికి పాల్పడుతున్న నేపథ్యంలో సంఘం నుంచి బహిష్కరిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘ విద్రోహానికి పాల్పడుతున్న అంజి చేస్తున్న దుష్ప్రచారాన్ని వీఆర్‌ఏలు నమ్మి మోసపోవద్దని ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment