అందరికీ అందుబాటులో న్యాయం
చిలకలపూడి(మచిలీపట్నం): ‘అందరికీ న్యాయం.. అందుబాటులో న్యాయం’ నినాదంతో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జాతీయ న్యాయసేవా దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ సంస్థ ద్వారా కల్పిస్తున్నా మని తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ.. కేసులను సత్వరం పరిష్కరించుకుంటే వివాదాలకు తావుండదని, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. ఇందు కోసం న్యాయసేవాధికార సంస్థను ఏర్పాటు చేశారని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య మాట్లాడుతూ.. జాతీయ న్యాయసేవా దినోత్సవాన్ని ఏటా నవంబర్ తొమ్మిదో తేదీన జరుపుకొంటామని, అందుకు ముందుగా న్యాయసేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో న్యాయం పొందే హక్కు కూడా ఒక భాగంగా ఉందని, దానిని అమలు చేసేందుకే 1987వ సంవత్సరంలో న్యాయసేవాధికార సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని 1995 నుంచి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కక్షిదారులకు, పేద ప్రజలకు ఉచిత న్యాయసహాయం, సలహాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కోర్టు సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
Comments
Please login to add a commentAdd a comment