సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం | - | Sakshi
Sakshi News home page

సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం

Published Sat, Nov 9 2024 2:21 AM | Last Updated on Sat, Nov 9 2024 2:21 AM

సెస్‌

సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం

సంతకు వచ్చే జీవాలను కొనుగోలు చేసిన వ్యాపారులు కానీ రైతులు కానీ మార్కెట్‌ యార్డు సిబ్బందికి సెస్‌ రూపంలో ఒక్కొక్క జీవానికి రూ.100 చొప్పున చెల్లించాలి. వసూలు చేసిన సెస్‌ మొత్తానికి మార్కెట్‌ యార్డు సిబ్బంది తప్పకుండా రశీదు ఇవ్వాలి. 20 నుంచి 30 జీవాలను గుంపుగా కొనుగోలు చేసిన వ్యాపారులు సగం సెస్‌ మాత్రమే చెల్లించి బిల్లులు తీసుకోకుండా వెళ్లి పోతున్నారు. మరి కొందరు సెజ్‌ చెల్లించి రశీదు అడిగితే సిబ్బంది హేళన చేసి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఒక్కొక్క వారానికి 500 నుంచి 1000 జీవాల క్రయవిక్రయాలు జరిగితే మార్కెట్‌ యార్డుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. సిబ్బంది యాభై శాతం సెస్‌ సొమ్మను నొక్కేస్తున్నారని జీవాల పెంపకందారులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.2 లక్షలకు పైగా మార్కెట్‌ యార్డ్‌ ఆదాయానికి గండి కొడుతున్నారని అంచనా.

జి.కొండూరు: మైలవరం మార్కెట్‌ యార్డులో ప్రతి శుక్రవారం జీవాల సంత జరుగుతుంది. సంతలో క్రయవిక్రయాలు జరిగిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి సెస్‌ చెల్లిస్తాడు. అయితే ఈ సెస్‌కు మార్కెట్‌ యార్డు సిబ్బంది పూర్తిస్థాయిలో రశీదులు ఇవ్వడంలేదు. బిల్లులు ఇవ్వని డబ్బుని నొక్కేస్తున్నారు. సంతలో సడేమియాలా సిబ్బంది బహిరంగంగానే సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఎదురు చెప్పలేక, గట్టిగా బిల్లులు అడగలేక సంతకు వచ్చిన వ్యాపారాలు, జీవాల పెంపకందారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

వారానికి రూ.లక్షల్లో వ్యాపారం

మైలవరం మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో యార్డు అధికారుల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జీవాల సంత జరుగుతుంది. ఈ సంతకు నియోజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నంతో పాటు తిరువూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కూడా జీవాల పెంపకందార్లు తమ గొర్రెలు, మేకలను విక్రయించేందుకు వస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మటన్‌ వ్యాపారులు, రైతులు ఈ జీవాలను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ప్రతి శుక్రవారం సంతకు వేయికి పైగా జీవాలు వస్తుంటాయి. ఒక్కొక్క సంతలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా.

మైలవరం జీవాల సంతలో అధికారుల సన్నాయి నొక్కులు బిల్లులు లేకుండా సెస్‌ వసూలుచేస్తున్న ఏఎంసీ సిబ్బంది యార్డు ఆదాయానికి గండికొడుతూ చేతివాటం చూపుతున్న వైనం

అవకతవకలు లేకుండా చూస్తాం

సెస్‌ వసూలు విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు తెలిసినా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. సెస్‌ చెల్లించిన వారికి తప్పకుండా బిల్లులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. సంత నిర్వహణలో జీవాల పెంపకందారులకు లేదా వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.

– కె శ్రీనివాసరావు, మైలవరం మార్కెట్‌ యార్డు సెక్రటరీ

సెస్‌ పక్కదారి ఇలా

మైలవరం మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన జీవాల సంతని ‘సాక్షి’ సందర్శించింది. సెస్‌ వసూలు చేస్తున్న తీరుపై అనుమానం వచ్చి జీవాలను కొనుగోలు చేసిన ఓ వ్యక్తిని ఆరా తీయగా, తాను ఒక్కొక్క జీవానికి సెస్‌ రూపంలో రూ.100 చొప్పున పది జీవాలకు వెయ్యి రూపాయలు చెల్లించానని, రశీదు మాత్రం ఇవ్వలేదని చెప్పాడు. మరో కొనుగోలుదారుడిని రశీదుపై ప్రశ్నించగా, తాను ఒక జీవాన్ని కొని మార్కెట్‌ యార్డు సిబ్బందికి రూ.100 సె’ఏ చెల్లించి బిల్లు అడిగితే ‘పెద్ద గొప్పోడు దిగొచ్చాడు బిల్లు అడగడానికి’ అంటూ హేళన చేశారని బదులిచ్చారు. ఈ విధంగా సంతలో ఏ వ్యాపారిని అడిగినా వారి జవాబులు ఇలానే వచ్చాయి. ఉన్నతాధికారులు స్పందించి సంత నిర్వహణలో మార్కెట్‌ యార్డు సిబ్బంది నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జీవాల క్రయ విక్రయదారులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం 1
1/2

సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం

సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం 2
2/2

సెస్‌ను సగానికిపైగా నొక్కేస్తున్న వైనం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement