ఇసుక రీచ్ తొలగించాలంటూ రైతుల ఆందోళన
పెనుగంచిప్రోలు: మండలంలోని అనిగండ్లపాడు గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను తక్షణం తొలగించాలని అనిగండ్లపాడు, శివపురం గ్రామానికి చెందిన రైతులు
ఆదివారం పెనుగంచిప్రోలు–2 ఇసుక రీచ్ వద్ద ఆందోళన చేశారు. ఇక్కడ ఇసుక రీచ్ కారణంగా పొలాలు దెబ్బతింటున్నాయంటూ ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు
అందజేసిన రైతులు, నవంబర్ ఒకటోతేదీన రీచ్ వద్ద ఇసుక టిప్పర్లను కూడా అడ్డుకున్నారు. అయినప్పటికీ రీచ్‌లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డున డంప్ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అనిగండ్లపాడు గ్రామ సమీపంలో పెనుగంచిప్రోలు గ్రామరెవిన్యూ పరిధిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడంతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి మునేరుకు వచ్చే వరదలు ఇసుక తరలింపుతో పంట పొలాలు పూర్తిగా కొట్టుకు పోయి నష్టపోతున్నారన్నారు. ఇసుక తవ్వకాల కారణంగా పక్కనే ఉన్న అనిగండ్లపాడు, శివాపురం గ్రామాలకు చెందిన మంచినీటి పథకాలు కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ఇదేవిధంగా ఇసుక తవ్వకాలు సాగితే భవిష్యత్‌లో తమకు మంచినీటి ఇక్కట్లు తప్పవన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక రీచ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో శ్రీతిరుపతమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ అత్తలూరి అచ్యుతరావు, రైతులు పొందూరి శేఖర్, టి.మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment