నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని నిత్యాన్న దానానికి గన్నవరానికి చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళం అందజేశారు. గన్నవరం గొల్లనపల్లికి చెందిన బొబ్బ గాంధీ కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారి రమేష్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు.
ఎస్‌జీఎఫ్ అండర్–17 హ్యాండ్‌బాల్ విజేత కృష్ణా
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68వ రాష్ట్ర స్థాయి అండర్–17 హ్యాండ్‌బాల్ బాలికల ట్రోఫీని కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకుంది. పటమటలోని బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. ద్వితీయ స్థానంలో శ్రీకాకుళం, తృతీయ స్థానంలో విజయనగరం నిలిచాయి. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.ఎస్తేరురాణి, లయన్స్ క్లబ్ జ్యూరీ మిరియాల వెంకటేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ షేక్ లాల్‌మధు, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్.దుర్గారావు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు.
ముగిసిన జాతీయ పోటీలు
విజయవాడస్పోర్ట్స్: హైదరాబాద్ రీజియన్ మౌంట్ ఫోర్డ్ స్కూల్స్ జాతీయ పోటీలు సోమవారం ముగిశాయి. విజయవాడలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్లో మూడు రోజుల పాటు జరిగిన పోటీలకు ఆంధ్ర, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 1,200 మంది క్రీడాకారులు అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఖోఖో, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు ప్రాతినిధ్యం వహించారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ విన్నర్ ట్రోఫీని లిటిల్‌ఫ్లవర్ స్కూల్(హైదరాబాద్), రన్నర్ ట్రోఫీని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్(విజయవాడ) దక్కించున్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో తొమ్మిది మందిని, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టేబుల్‌టెన్నిస్, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో పదిమందిని ఉత్తమ క్రీడాకారులుగా గుర్తించి ప్రత్యేక బహుమతులు అందజేశారు. విద్యార్థులు విద్యతోపాటు ఆట్లోనూ రాణించాలని అతిథులు ఆకాంక్షించారు. విజేతలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, బిషప్ మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు తెలగతోటి, ఎన్‌ఎస్‌ఎం స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి, కరస్పాండెంట్ బ్రదర్ మౌంటి, వైస్ ప్రిన్సిపాల్ బాలారెడ్డి బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment