చివరి ఆయకట్టుకు దూరం
సాగర్ జలం..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మూడో జోన్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు సాగర్ జలాలు అందడం కలగానే మిగిలింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయకట్టు చివరి భూములకు కేటాయించిన మొత్తం జలాలు సరఫరా జరగడం లేదు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో నిత్యం కాలువలకు గండ్లు పడుతున్నాయి. కాలువల యూటీలు కూలుతున్నాయి. ఫలితంగా మూడో జోన్ పరిధిలోని మూలపాడు, ఇబ్రహీంపట్నం మేజర్లకు సాగునీరు అందడం లేదు. దీనికి తోడు కాలువలు నీటి ప్రవాహ సామర్థ్యం కోల్పోయాయి. కంప, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఫలితంగా సాగునీరు అందక మెట్ట ప్రాంత రైతులు అల్లాడిపోతున్నారు.
51,069 ఎకరాల ఆయకట్టు
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూడో జోన్ పరిధిలో మైలవరం బ్రాంచ్ కెనాల్, మూలపాడు, ఇబ్రహీంపట్నం మేజర్ కాలువలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌పీ కాలువ వీరులపాడు మండలం గూడెంమాధవరం, తెలంగాణలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామాల వద్ద ఆంధ్రలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలువల కింద కంచికచర్ల, వీరులపాడు, ఇబ్రహీంపట్నం మండలాల్లో మెట్ట పైర్లు సాగవుతున్నాయి. మూలపాడు మేజర్ కాలువ 40.250 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. దీనికింద 39,222 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి అనుసంధానంగా 40కు పైగా మైనర్ కాలువలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మేజర్ కాలువ 30.690 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికింద 11,847 ఎకరాల ఆయకట్టు ఉంది. మూలపాడు మేజర్‌కు 750 క్యూసెక్కులు, ఇబ్రహీంపట్నం మేజర్‌కు 350 క్యూసెక్కులు కేటాయించారు. ఆయకట్టు పరిధిలో పత్తి, మిరప, మొక్క జొన్న, సుబాబుల్ పంటలు సాగవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో నీటిని విడుదల చేయాల్సి ఉంది.
సరిహద్దులో కూలిన యూటీలు
నాలుగు రోజుల క్రితం ఎన్‌ఎ్‌స్‌పీ మూడో జోన్ పరిధిలోని మైలవరం బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ)కు నీటిని విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం నీరు వస్తుందని ఆయకట్టు చివరి భూముల రైతులు సంతోషపడ్డారు. ఆయిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకున్నారు. అయితే సాగర్ జలాలు ఆంధ్రలో ప్రవేశించే చోట అంటే ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద మైలవరం బ్రాంచ్ కెనాల్‌పై రెండు యూటీలు కూలిపోయాయి. దీంతో సాగర్ జలాలు ఆంధ్రలోకి రాకుండా నిలిచిపోయాయి. ఫలి తంగా మూలపాడు, ఇబ్రహీంపట్నం మేజర్ల కింద కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని మెట్ట రైతులు నీరు లేక అల్లాడుతున్నారు. మెట్ట పైర్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తరచూ సరిహద్దులో కాలువకు గండ్లు, యూటీలు కూలడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంత రైతులు ఉద్దేశపూర్వకంగానే గండ్లు కొడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అధికారులు చొరవ తీసుకోవాలి
ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో నిత్యం సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలువలకు గండ్లు పడడంతో నీరు రావడం లేదు. సరిగ్గా సరిహద్దులో తెలంగాణ వైపు గండ్లు కావడంతో ఇక్కడి అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి సరిహద్దు రాష్ట్రం అధికారులతో మాట్లాడి గండ్లు పూడ్చే విధంగా చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంటల సాగు కష్టమే
ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు చివరిలో ఉన్నాం. పత్తి, మిరప సాగు చేస్తున్నాం. ప్రస్తుతం పంటలకు నీటి తడులు వసరం. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో సాగర్ నీరు విడుదల చేయాలి. ప్రస్తుతం జలాలు వదిలినా కాలువలకు గండ్లు, యూటీలు కూలిపోయిన కారణంగా నీరందడం లేదు. ఏటా ఇదే పరిస్థితి. ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. యుద్ధ ప్రాతిపదికన గండ్లు, యూటీలకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుని ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలి.
– నరెడ్ల శ్రీను, రైతు, జయంతి గ్రామం, వీరులపాడు మండలం
అధ్వానంగా సాగర్ కాలువలు
ఎన్‌ఎస్‌పీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో కాలువల స్వరూపమే మారిపోయింది. నీటి పారుదల సామర్థ్యాన్ని కోల్పోయాయి. ప్రారంభంలో నిర్దేశించిన లక్ష్యాని కంటే సగానికి సగం పడిపోయింది. నిర్వహణ లోపం, సిబ్బంది కొరత ఇందుకు కారణమని రైతులు పేర్కొ న్నారు. 34 మంది లష్కర్లు ఉండాల్సిన చోట ఇద్దరే పనిచేస్తున్నారు. కాలువలు సామర్థ్యం కోల్పోవడంతో వచ్చే అరకొర నీరు కూడా చివరి భూములకు అందడం లేదు. సాగర్ జలాలు కలేనని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నీటి ప్రవాహ సామర్థ్యం పూర్తి కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని మైనర్ కాలువలు పూడిపోయాయని వివరిస్తున్నారు.
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో కూలిన యూటీలు కంప, పిచ్చి మొక్కలతో అధ్వానంగా కాలువలు నీరందక అల్లాడుతున్న మెట్ట ప్రాంత రైతులు
Comments
Please login to add a commentAdd a comment