చిట్టీల పేరుతో మోసం | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మోసం

Published Thu, Apr 18 2024 11:50 AM

-

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: చిట్టీల వ్యాపారం పేరుతో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేసి పరారైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తురకా పుల్లయ్యపై హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడరోడ్డులో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర చిట్‌ఫండ్స్‌ కంపెనీ ఏర్పాటు చేసి తోటి టీచర్లు, ఉద్యోగులను నుంచి రూ.కోట్లలో చిట్టీలు, డిపాజిట్లు కట్టించుకుని చివరికి ఊడాయించాడు. ఖాతాదారులంతా లబోదిబోమంటూ తురకా పుల్లయ్య బాధితుల సంఘంగా ఏర్పడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్‌ 420, 406, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్ల రక్షణ చట్టం కింద తురకా పుల్లయ్య, ఆయన కుమారుడు అశోక్‌రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఏడీఎల్‌ జనార్ధన్‌ బుధవారం తెలిపారు. పక్కా పథకం ప్రకారం ముందస్తుగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేయటంతో పాటుగా, స్థిరాస్తులను ఇతరుల పేరిట బదలాయించి కుటుంబ సభ్యులతో సహా గ్రామం నుంచి పరారయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఇప్పటికే కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా, మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

నిర్వాహకుడు ప్రభుత్వ టీచర్‌ పుల్లయ్య

జంక్షన్‌ నుంచి పరారు

కేసు నమోదు

Advertisement
 
Advertisement
 
Advertisement