గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Published Fri, Apr 19 2024 1:25 AM

నగదును అందిస్తున్న రాజేంద్రప్రసాద్‌, నందకిషోర్‌  - Sakshi

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానదిలో రైల్వేట్రాక్‌ కింద రెండు, మూడు నంబర్ల ఫిల్లర్‌ మధ్యన ఇసుకలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిపే వివరాలేవి లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని, ఎరుపు, తెలుపు, బ్లూ, బ్లాక్‌ డిజైన్‌ గుర్తులు కలిగిన తెలుపురంగు పుల్‌హాండ్స్‌ చొక్కా, నలుపురంగు జీన్స్‌ ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడని వివరించారు. కాళ్లకు ఆరెంజ్‌, తెలుపు, బ్లాక్‌ రంగు కలిగిన షూ వేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మరణించాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్యచేసి నదిలో పడేసి ఉంటారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ యువకుడు.. మృత్యుంజయుడు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బాపులపాడు మండలం బొమ్ములూరులో 150 అడుగుల లోతైన వ్యవసాయ గాడిబావిలో ప్రమాదవశాత్తూ పడిన ఓ యువకుడిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షించారు. వివరాల్లో వెళ్లితే..గ్రామానికి చెందిన కత్తుల పవన్‌ అనే యువకుడు గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ వ్యవసాయ గాడిబావిలో పడిపోయాడు. గమనించిన తోటిమిత్రులు భయాందోళనతో హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందించగా, ఎస్‌ఐ ఏడీఎల్‌ జనార్దన్‌ హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే హనుమాన్‌జంక్షన్‌ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్‌ ఆఫీసర్‌ గరికపాటి రామ్మోహనరావు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని 150అడుగుల లోతైన గాడిబావిలో పడిన యువకుడిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న కత్తుల పవన్‌ను చినఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్యశాలకు చికిత్సనిమిత్తం తరలించారు. రాత్రివేళలో పవన్‌, అతని మిత్రులు వ్యవసాయ గాడిబావి వద్దకు ఎందుకు వెళ్లారు?, ప్రమాదవశాత్తూ గాడిబావిలో పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏసీబీకి చిక్కిన ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు

తెనాలి రూరల్‌: ఏసీబీ వలకు ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులు, మరో ప్రైవేట్‌ బిల్డింగ్‌ ప్లానర్‌ చిక్కారు. ఓ భవన నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిపోయారు. గుంటూరు ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ మహేంద్ర మాతే వివరాల మేరకు.. చేబ్రోలు మండలం వడ్లమూడికి చెందిన ఓ వ్యక్తి జీ ప్లస్‌ టూ భవన నిర్మాణం కోసం తెనాలిలోని సీఆర్డీఏ జోనల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లీల చంద్రశేఖరరావు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర సాయినాథ్‌ అతనిని రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశారు. నగదును తెనాలిలోని ప్రైవేటు బిల్డింగ్‌ ప్లానర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ద్వారా పంపాలని షరుతు పెట్టారు. అనుమతులకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తి, సమీప బంధువు రత్నబాబుతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగానే నగదును ఇమ్రాన్‌ఖాన్‌కు గురువారం అందజేయగా అతను తీసుకెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో ఉన్న చంద్రశేఖరరావు, రాజేంద్రసాయినాథ్‌కు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వీరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు సీఆర్డీఏ ఉద్యోగులతో పాటు ప్రైవేటు బిల్డింగ్‌ ప్లానర్‌పైనా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు సత్యానంద్‌, ప్రతాప్‌కుమార్‌, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

రూ.1.01లక్షల విరాళం

కోడూరు: కోడూరులో నూతనంగా నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి అల్లంశెట్టి రాజేంద్రప్రసాద్‌–లక్ష్మి, నందకిషోర్‌–సుమప్రియ దంపతులు రూ.1,0,1,116 నగదును విరాళంగా అందజేశారు. ఈ మేరకు నగదును గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. పూర్తి గ్రానైట్‌తో నిర్మిస్తున్న ఆలయానికి తమవంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్‌, నందకిషోర్‌ దంపతులు తెలిపారు. కమిటీ సభ్యులు అన్నం వెంకటసుబ్బారావు, బూరగడ్డ హరినాథ్‌బాబు, జూపూడి సుభాష్‌చంద్రబోస్‌, బడే భావన్నారాయణ, అన్నం శివరామకృష్ణ, ఉల్లి రంగారావు పాల్గొన్నారు.

భవన నిర్మాణ అనుమతులకు రూ.30వేలు లంచం డిమాండ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు మరో ప్రైవేటు బిల్డింగ్‌ ప్లానర్‌పై కూడా కేసు నమోదు

ఏసీబీకి చిక్కిన చంద్రశేఖరరావు(ఎడమ), పక్కన ప్రైవేటు బిల్డింగ్‌ ప్లానర్‌ ఇమ్రాన్‌ఖాన్‌
1/2

ఏసీబీకి చిక్కిన చంద్రశేఖరరావు(ఎడమ), పక్కన ప్రైవేటు బిల్డింగ్‌ ప్లానర్‌ ఇమ్రాన్‌ఖాన్‌

అపస్మారక స్థితిలో ఉన్న కత్తుల పవన్‌
2/2

అపస్మారక స్థితిలో ఉన్న కత్తుల పవన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement