మాజీఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం: బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆర్‌ఎస్. నెం.11లో పేదలకు ఇళ్లస్థలాలు, సామాజిక అవసరాల కోసం కేటాయించిన వంద ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీకి ఆయన లేఖ రాశారు. మల్లవల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 2016లో అప్పటి సీఎం చంద్రబాబు సూచన మేరకు ఎమ్మెల్యేగా తాను, రెవెన్యూ అధికారులు కలిసి ఆర్‌ఎస్. నెం.11లో 1,466 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ భూసేకరణతో అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.50వేలు పరిహారం, ఇంటిస్థలం మంజూరు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈమేరకు ఆర్‌ఆర్. నెం 11లో వంద ఎకరాలను ఇళ్లస్థలాలు, సామాజిక అవసరాలకు కేటాయిస్తూ అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలుపగా, అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీకి అంగీకరించారని గుర్తుచేశారు. అయితే స్థలం లేనివారికి మాత్రమే ఇస్తామంటూ అప్పటి కలెక్టర్లు చెప్పడంతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుందన్నారు. ఈవిషయాన్ని మరోసారి అప్పటి సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు 1,924 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు.
పట్టాలు పంపిణీ చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఎన్నికలు ముగిసినప్పటికీ బాపులపాడు తహసీల్దారు కార్యాలయంలో ఉన్న ఇళ్లపట్టాలను పంపిణీ చేయలేదన్నారు. ప్రస్తుతం ఈ వంద ఎకరాల భూములను ఏపీఐఐసీ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఈ భూమిలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన జెడ్పీ హైస్కూల్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తికావచ్చిందని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ మేరకు సదరు భూమిలో గ్రామ అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రి, గుడి, మసీదు, చర్చి, షాదీఖానా, కల్యాణ మండపం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆ భూమిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నాలను విరమించుకుని కుల, మత, రాజకీయాలకతీతంగా రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఇంటిస్థలాలను పంపిణీ చేయాలన్నారు. తహసీల్దారు కార్యాలయంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల పట్టాలను సదరు కుటుంబాలకు అందజేయాలని ఆ లేఖలో కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment