ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ( పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో పీజీఆర్‌ఎస్ జరిగింది. నిధి మీనా.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను ఏరోజుకారోజే ఓపెన్ చేయాలని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు.
● జి.కొండూరు గ్రామంలో సర్వే నంబర్ 293/2బిలో 1.10 ఎకరాలు భూమి ఉంది. జాతీయ రహదారి కోసం 31 సెంట్లు భూమి సేకరించారు. అప్పటి నుంచి సర్వే సబ్ డివిజన్ చేయలేదు. సర్వే సబ్ డివిజన్ చేసి పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో మిగిలిన భూమిని ఎంటర్ చేయాలంటూ జి.కొండూరుకు చెందిన మాదాసు కొండలరావు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు.
● అన్యాయంగా తమను తొలగించారంటూ విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన సుండురి రత్నకుమారి తో పాటు మరో 8 మంది బుక్ కీపర్లు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా విధుల్లోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నిధిమీనా పీజీఆర్‌ఎస్‌కు 97 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ నిధిమీనా
97 అర్జీలు
మొత్తం 97 అర్జీలు అందాయని కలెక్టర్ నిధి మీనా తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, పోలీస్ 14, మునిసిపల్, పట్టణాభివృద్ధి 14, వైద్య ఆరోగ్యం 6, మార్కెటింగ్ 6, పంచాయతీరాజ్ 5, ఉపాధి కల్పన 2, ఏపీసీపీడీసీఎల్ 2, బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రెండు అర్జీలు రాగా పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, ఏపీఈడబ్ల్యూఐడీసీ, డ్వామా, డీఆర్‌డీఏ, సహకార, సాంఘిక సంక్షేమానికి సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment