బుడమేరు ప్రక్షాళన చేసి విజయవాడకు ముంపు ముప్పు తొలగిస్తా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరును ఆధునికీకరిస్తామని వరదల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు దాన్ని మరిచారు. మాటిచ్చి రెండున్నర నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నాడు హడావుడి చేసిన పాలకులు నేడు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. వరదల సమయంలో తాత్కాలికంగా గండ్లు పూడ్చారు. వాటి నుంచి సీపేజీ(గండ్లు పూడ్చిన చోట రాళ్ల కింద నుంచి నీరు) వస్తుండటంతో ఆ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు గేట్లు రెండు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు జరగకపోవడం.. పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో గేట్ల నుంచి నీరు లీకవుతోంది. బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలపై సంయుక్త బృందాలు సర్వే చేశాయి. విజయవాడ రూరల్ పరిధిలోని 260 ఎకరాల్లో బుడమేరు వాగులో అక్రమంగా సాగు చేసుకొంటున్నారని, సర్వే నంబర్ల వారీగా గుర్తించారు. సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు 80 ఎకరాల్లో బుడమేరు వాగు వెంబడి 3,100 భవనాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం ఊదరగొట్టింది. కేవలం సర్వేకు పరిమితమై ఆధునికీకరణను నిర్లక్ష్యం చేసింది.
అభివృద్ధిపై తీవ్ర ప్రభావం
బుడమేరు ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలిచి పనులు వేసవి కాలం చేపట్టి, వర్షాకాలం నాటికి పూర్తి చేయకపోతే మరోసారి బెజవాడ ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. శాశ్వత మరమ్మతులు చేయకపోతే, వరద ముంపు భయంతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి, శాంతినగర్, జి.కొండూరు మండలంలో కవులూరు, వెలగలేరు, కందులపాడు, వెల్లటూరు, గుంటుముక్కల, చిన్న నందిగామ, హెచ్ ముత్యాలంపాడు, విజయవాడ రూరల్ మండలంలో పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి, నున్నతో పాటు, విజయవాడలో అజిత్‌సింగ్‌నగర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరు వరద భయం ఉంది. ముంపు భయం వీడకపోతే బెజవాడ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు తగ్గిపోయాయి.
రెండు గేట్ల నుంచి లీకేజీ..
బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ 1956లో నిర్మించారు. సరైన నిర్వహణ లేక గేట్లు ఎత్తినప్పుడు, దింపినప్పుడు రాడ్లు బెండు రావడంతో గేట్లు మొరాయిస్తున్నాయి. ఇక్కడ11 గేట్లకు రెండు పూర్తిగా కిందకు దిగడంలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న బుడమేరుకు వచ్చిన వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసే సమయంలో ఈ రెండు గేట్లు మొరాయించడంతో అధికారులు మాన్యువల్‌గానే ఎత్తారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత గేట్లను దించినప్పుడు ఈ రెండు గేట్లు పూర్తిగా కిందకు దిగలేదు. పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వకు విడుదల చేసిన నీరు ఈ రెగ్యులేటర్‌ను ఆనుకొని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలవాల్సి ఉంది. అయితే ఈ నెల 15వ తేదీ ఉదయానికి పట్టిసీమ నీటి ప్రవాహం పెరగడంతో హెడ్‌రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం 4.5 అడుగులకు చేరింది. ఈ రెండు గేట్లు పూర్తిగా కిందకి దిగకపోవడంతో వీటి నుంచి నీరు ఒకరోజంతా దిగువ బుడమేరు కాల్వకు వెళ్లింది. గేట్ల మరమ్మతుల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉండటంతో పట్టిసీమ నీరు వృథాగా పోతోంది.
బుడమేరును
ప్రక్షాళన చేసి ఆధునీకరించి, బెజవాడకు వరద ముప్పు లేకుండా చేస్తాం: వరదల వేళ సీఎం
చంద్రబాబు
బుడమేరు ఆధునికీకరణేదీ?
ముంపు లేకుండా చేస్తామన్నారు.. సీఎం సారూ.. మాటిచ్చి రెండున్నర నెలలు దాటుతోంది శాశ్వత మరమ్మతుల ఊసెత్తని సర్కార్ బడ్జెట్‌లో నిధులు సున్నా! హెడ్ రెగ్యులేటరీ లీకేజీతో దిగువకు నీరు విజయవాడకు తొలగని ముప్పు
Comments
Please login to add a commentAdd a comment