ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పని చేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, సంబంధం లేని పనులు చేయించకూడదన్నారు. రిటైర్మెంట్ వయసు వరకు పని చేయించుకుని బెనిఫెట్లు ఇవ్వకుండానే ప్రభుత్వం తొలగిస్తోందని, ఇది సరి కాదని హితవు పలికారు. ఆశ వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల పెంపు జీవో వర్తింపజేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, కొందరు అనారోగ్యంతో ఆశ వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని, ప్రభుత్వం ఆశ వర్కర్స్‌కు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్పు చేయాలన్నారు. మెడికల్ లీవ్, మెటర్నిటీ లీవ్, రిటైర్‌మెంట్ బెనిఫెట్లు రూ. 60వేలు, మట్టి ఖర్చులకు రూ. 20వేలు, వయోపరిమితి పెంపు, సహజమరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని జీవోల రూపంలో ఇవ్వాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ ఖాళీ పోస్టులను రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, సంఘ జిల్లా నేత సోమేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు, విజయవాడ వెస్ట్ సిటీ కార్యదర్శి ఇ.వి.నారాయణ, వెంకట్రావు, నందిగామ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment