డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ
విజయవాడస్పోర్ట్స్: జిల్లాలోని 35 మంది గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణ చురుగ్గా కొనసాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కమిషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేరాలను అరికడుతున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. అందులోభాగంగానే రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. డ్రోన్ ఆపరేటింగ్‌తో కలిగే ప్రయోజనాలను మహిళా పోలీసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ హనీష్ పాల్గొన్నారు.
18 మిస్సింగ్ కేసులు ఛేదించాం..
గడిచిన వారం రోజుల వ్యవధిలో తప్పిపోయిన 18మంది మహిళల, బాలికలను గుర్తించి తిరిగి వారి కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న మహిళల, బాలికల మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు డీసీపీ గౌతమి షాలి నేతృత్వంలో సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ యు.హైమావతి, మరి కొంత మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించినట్లు వివరించారు. ఈ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్నాయని వెల్లడించారు. మిగిలిన కేసులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పోలీసు కమిషనర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment