పాఠశాలల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు కృషి
ఎంపీ కేశినేని శివనాథ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌జిల్లా రాష్ట్రంలోని ఇతరజిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిఏటా స్పోర్ట్స్‌మీట్ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్‌తో కేబీఎన్ కళాశాలలో డీఈవో యూవీ సుబ్బారావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌లో భాగం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు పీఈటీ, పీడీలు కృషిచేయాలని సూచించారు.
2027లో అమరావతిలో నేషనల్ గేమ్స్..
సీఎం చంద్రబాబు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. అందులో భాగంగానే అమరావతిలో స్పోర్ట్స్ సిటీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రానుందని ఎంపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment