సాక్షి, అమరావతి: విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులు తనపై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, గౌతమ్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని గౌతమ్‌రెడ్డిని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. సత్యనారాయణపురంలో ఓస్థలం వివాదంలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ గౌతమ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గౌతమ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు, ఫిర్యాదుదారుకు మధ్య ఎప్పటినుంచో భూవివాదం ఉందన్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అందువల్లే దురుద్దేశంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పీపీ వాదనలు వినిపిస్తూ ఈవ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ)వాదనలు వినిపిస్తారని తెలిపారు. అందువల్ల విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తూ, గౌతమ్‌రెడ్డిపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment