చంద్రబాబుది కలల విజన్
మధురానగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047.. కలల విజన్ అని వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్లే అని.. కానీ 2047 వరకు ప్రణాళికలతో బాబు ఊహా ప్రపంచంలో ఉంటూ నిర్వర్తించవలసిన బాధ్యతలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేదలకు విద్య అందని ద్రాక్షగా మారిపోయిందన్నారు. విజన్ పేరుతో నాడు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజల దృష్టి మరల్చేందుకు పది సూత్రాలంటూ డ్రామాలాడుతున్నారన్నారు. ప్రధానంగా పేదరిక నిర్మూలన గూర్చి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2016 డిసెంబర్ నాటికి ఏపీలో 11.77 శాతం ఉన్న పేదరికం.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6.06 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు. జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని నవరత్నాల పథకాల రూపంలో గత ప్రభుత్వం సాధించిందని.. ఆ పథకాలను రద్దు చేసి పేదల ద్రోహిగా బాబు మారారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే 2.65 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసి.. ఉద్యోగ, ఉపాధి కల్పన అంటూ కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతులు సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలపై రూ.18 వేల కోట్ల భారాన్ని మోపిందని తెలిపారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మటానికి మరోసారి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని మల్లాది విష్ణు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment