సర్దుబాటు.. నగుబాటు! | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటు.. నగుబాటు!

Published Tue, Nov 26 2024 1:43 AM | Last Updated on Tue, Nov 26 2024 1:43 AM

సర్దుబాటు.. నగుబాటు!

సర్దుబాటు.. నగుబాటు!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ)లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఓ ప్రహసనంలా మారింది. ఒక రోజులో పూర్తయ్యే ప్రక్రియ మూడు నెలలుగా కొనసాగుతున్నా.. ఓ కొలిక్కి రాలేదు. పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత పట్టి పీడిస్తోంది. మూడు రోజుల క్రితం 10 మంది ఉపాధ్యాయులకు సంబంధించి జరిగిన పని సర్దుబాట్లు అసంబద్ధంగా ఉన్నాయని పలువురు టీచర్లు వాపోతున్నారు.

ఇవిగో ఉదాహరణలు..

● సెప్టెంబర్‌లో గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌లో సర్దుబాటుపై వచ్చిన ఉపాధ్యాయుడిని మళ్లీ వేరొక స్కూల్‌కు పంపారు. తొమ్మిది సెక్షన్‌లు ఉన్న గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఒక ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) మాత్రమే ఉన్నారు. ఎంతో కాలంగా హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎస్జీటీలను సెప్టెంబర్‌లో ఎలిమెంటరీ పాఠశాలలకు కేటాయించారు.

● ఏపీజే అబ్దుల్‌ కలాం హైస్కూల్‌లో ఇప్పటికి మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ లేని కారణంగా, ఇంత వరకు 10వ తరగతి బోధించని ఓ ఎస్జీటీని లెక్కలు టీచర్‌గా సంవత్సరం మధ్యలో కేటాయించడంతో పిల్లలకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వస్తున్నాయి.

● వీఎంసీ హైస్కూల్‌లో రెండు హిందీ పండిట్‌ పోస్టులు ఉండగా రివర్షన్‌ అయిన ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ని అదే స్కూల్‌లో కేటాయించకుండా క్యాడర్‌ స్ట్రెంత్‌ పేరుతో వేరే స్కూల్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు వీఎంసీ హైస్కూల్‌లో 10 సెక్షన్‌లకు హిందీ సబ్జెక్టుకు సంబంధించి ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ మాత్రమే ఉన్నారు. దీంతో అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

● ఎంఏఎంసీ ఉర్దూ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా మరో ఇద్దరు ఉపాధ్యాయులను పని సర్దుబాటుపై వేరే పాఠశాలకు కేటాయించారు. దీంతో అక్కడ హిందీ ఉపాధ్యాయుడు లేని పరిస్థితి నెలకొంది.

హెచ్‌ఎంగా ఉద్యోగోన్నతి పొందినా..

స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెడ్‌ మాస్టర్‌గా ఉద్యోగోన్నతి పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను మళ్లీ పాత స్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రమోషన్‌ పొందిన పాఠశాలలో 10వ తరగతి రోల్స్‌, జీతాల బిల్లులు చేయడంలో హెచ్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్యాడర్‌ స్ట్రెంత్‌ పేరుతో..

నగరపాలక సంస్థలో 15 తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌లు, 5 హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌లను రివర్షన్‌ చేసి, క్యాడర్‌ స్ట్రెంత్‌ పేరుతో వేర్వేరు పాఠశాలలకు బదిలీ చేశారు. దీంతో కొన్ని స్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ కొరత ఏర్పడింది. వాటిని సర్దుబాటు చేయాల్సి ఉన్నా చేయడం లేదు. వీటితో పాటు మ్యాథ్స్‌, బయాలజి, సోషల్‌, ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులు పలు పాఠశాలల్లో ఉన్నాయి. బీఎస్‌ఆర్‌ స్కూల్లో ఇద్దరు టీచర్లు అదనంగా ఉన్నారని సర్దుబాటు చేసినా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు జనరేట్‌ కాలేదని అలానే ఉంచారు. 37వ డివిజన్‌ ఎలక్ట్రిసిటీ కాలనీలోని ఎలిమెంటరీ స్కూల్‌లో 48 మంది విద్యార్థులుండగా ఒకే టీచరు ఉండటం గమనార్హం.

ఒక్కో టీచర్‌కు రెండు తరగతులు..

ఫరూక్‌నగర్‌లో 1నుంచి 8వ తరగతులకు సంబంధించి ఐదుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఒక్కో టీచర్‌ రెండు తరగతులకు బోధించాల్సి వస్తోంది. ఇలాంటి అసంబద్ధ పని సర్దుబాట్లు , లోప భూయిష్టమైన నిర్ణయాలతో విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

ప్రభుత్వ బడులపై చిన్నచూపు..

గత ప్రభుత్వం ప్రభుత్వ బడుల రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది. నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దారు. దీంతో మధ్యాహ్న భోజనం, విద్యార్థులు కిట్లు, ట్యాబ్‌లు, ఇలా పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులపై చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికీ సంస్కరణల పేరుతో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది. విద్యాసంవత్సరం చివరి చేరుకుంటున్నా, అవసరమైన చోట్ల టీచర్లను నియమించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు సైతం పెదవి విరుస్తున్నాయి.

వీఎంసీలో మూడు నెలలుగా సాగుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు 87 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు కొన్ని స్కూళ్లలో 10 సెక్షన్‌లకు ఒకే సబ్జెక్టు టీచర్‌ ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement