గడువులోగా అర్జీలను పరిష్కరించాల్సిందే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశా.. జాయింట్ కలెక్టర్ నిధిమీనా, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేలా టీమ్ కృషి చేయాలని సూచించారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
మొత్తం 71 అర్జీలు...
పీజీఆర్‌ఎస్‌కు సోమవారం 71 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 24, పురపాలక, పట్టణాభివృద్ధి 10, పంచాయతీరాజ్ 8, ఉపాధికల్పన 4, పోలీస్ 3, సహకార 3, మార్కెటింగ్ శాఖకు 3 అర్జీలు వచ్చాయి. వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, కార్మిక, సర్వే అండ్ సెటిల్‌మెంట్ విభాగాలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు రాగా విద్యుత్, డీఆర్డీఏ డ్వామా, అటవీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంకింగ్ సేవలు, రహదారులు, భవనాల శాఖకు సంబంధించి ఒకటి చొప్పున అర్జీలు అందాయి. అనంతరం కార్యాలయ ఆవరణలో పీజీఆర్‌ఎస్ అర్జీల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ, హెల్ప్ డెస్క్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment