దాగుడుమూతలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. ప్రభుత్వం నమ్మించి వంచిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు గతంలో ఏటా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పేరుతో బోధనా రుసుంను చెల్లించేది. వసతి దీవెన పేరుతో ఉపకార వేతనాలను అందించేది. 2023–2024 ఏడాదికి సంబంధించి ఒక విడతకు నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ పేరుతో కూటమి పార్టీలు హడావుడి చేయటంతో నిధులు ఉన్నా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు దాటుతున్నా ఇప్పటి వరకూ రీయింబర్స్‌మెంట్ ఇవ్వక పోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లు
ఫీజు బకాయిలు చెల్లించాలని కళాశాలల యజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు బకాయిలు చెల్లించలేక నలిగిపోతున్నారు. గడిచిన నెల రోజులుగా సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామని చెప్పడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. కొన్ని కళాశాలలు సగం ఫీజు కట్టాల్సిందేనని మొండికేయటంతో పిల్లల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టారు. మిగిలిన ఫీజు సైతం చెల్లించాలంటూ యజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి వద్దనే ఉంచుకోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులను బట్టి రూ.43 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఫీజు ఉన్నాయి. పాలకులు బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రాధాన్యమివ్వలేదు.
విద్యా దీవెనను ఎత్తివేసే కుయుక్తి
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 15 వరకూ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, మరో 35 వరకూ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా 40 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కాపు, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు గత ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేసింది. దీన్ని ఎత్తివేయడానికి పాలకులు కుయుక్తులు పన్నుతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో విద్యాదీవెనకు రూ.406.56 కోట్లు, వసతి దీవెనకు రూ.152.49 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బడ్జెట్‌లో అరకొర నిధులు జగన్ పాలనలో విద్యార్థులను ఆదుకున్న విద్యాదీవెన ఫీజుల కోసం పీడిస్తున్న ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు
ప్రభుత్వం నిధులను తక్షణం విడుదల చేయాలి
విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలి. గత ఏడాది బకాయిలు సైతం ఎన్నికల సమయంలో నిలిచిపోయాయి. వాటితో పాటుగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన నిధులను మంజూరు చేయాలి. ఫీజు చెల్లించేందుకు యాజమాన్యాల ఒత్తిడి కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి ఆరు మాసాలైన దీనిపై దృష్టి పెట్టకపోవడం దుర్మార్గం.
–సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి,
ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment