పార్వతీపురంలో విడిపోయిన బోగీలవద్దకు వస్తున్న ఇంజిన్
పార్వతీపురం టౌన్: పార్వతీపురం గుండా వెళ్తున్న సమతా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయన్న విషయం పార్వతీపురం పట్టణమంతా వ్యాపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చేపట్టిన మెగాబ్లాక్ పనులు పూర్తి చేసిన రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాయంత్రం 5 గంటల సమయంలో లైన్స్ క్లియర్ చేశారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో రావాల్సిన నిజాముధ్దీన్– విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపటిలో 3వ నంబర్ ఫ్లాట్‌ఫారం మీదికి రానున్నదని రాత్రి 7.20 గంటలకు పార్వతీపురం స్టేషన్‌లో అనౌన్స్ చేశారు. పది నిమిషాల్లో హారన్ కొడుతూ 7.30 గంటలకు సమతా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ మాత్రమే 3వ నంబర్ ప్లాట్ ఫాం మీదికి వచ్చింది. విడిపోయిన బోగీలలో వెనక బోగిలో ఉన్న గార్డ్ ఈ విషయాన్ని గమనించి ఇంజిన్ లేకున్నా కదులుతున్న బోగీలను ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడంతో బోగీలన్నీ పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో ఆగిపోయాయి.
ఇంజిన్ లేకుండా బోగీలన్నీ సుమారు అరకిలోమీటరు వరకు ప్రయాణించాయి. గార్డు అప్రమత్తం కావడం వల్ల పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. మెగాబ్లాక్‌లో భాగంగా చేపట్టిన మెయింటనెన్స్ పనుల్లో ఎక్కడో ఒకచోట కపిలింగ్ ఊడిపోవడం వల్ల ఇంజిన్ నుంచి బోగీలు వేరు పడ్డాయని టెక్నీషియన్లు తెలిపారు. తర్వాత ఇంజిన్‌ను వెనక్కి తీసుకువెళ్లి టెక్నీషియన్లు కపిలింగ్ వేయడంతో రాత్రి 9 గంటల సమయంలో పార్వతీపురం స్టేషన్ నుంచి గంటన్నర ఆలస్యంగా సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment