దోపిడీ దొంగల హల్‌చల్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బీజేడి నాయకుడు సునీల్ సాహు లక్ష్యంగా దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం వేకువజామున అతని స్వగ్రామం డొంగ్రుబజలో ఉన్న ఇంటిపై తుపాకీలతో దాడులకు తెగబడ్డారు. ఇంటి తలుపులు విరగ్గొడుతూ చొరబడ్డారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బీరువాలు పగలుగొట్టి ఫైల్స్ చిందరవందరగా పడివేశారు. అదే ఇంటిలో వేరే పోర్సన్‌లో అద్దెకు ఉంటున్న రోహిత్ బెహరా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో పిల్లల తలపై తుపాకులు గురిపెట్టి సునీల్ కోసం వాకబు చేశారు. అయితే సునీల్ నబరంగ్‌పూర్ పట్టణంలో ఉన్నారని, తాము అద్దెకు ఉంటున్నామని ఆ కుటుంబీకులు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లో బీరువాలు తనిఖీ చేసి సుమారు రూ.7 లక్షలు విలువ చేసే నగలు అపహరించుకుపోయారు. ఉదయం వరకు భయంతో రోహిత్ కుటుంబీకులు ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నబరంగ్‌పూర్ ఐఐసీ సంబిత్ బెహరా నేతృత్వంలో బలగాలు సంఘటన స్ధలానికి చేరుకున్నాయి. సునీల్ సాహు సైతం స్వగ్రామానికి చేరుకున్నారు.
దర్యాప్తు ప్రారంభం
ఏడుగురు దొంగల దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలను తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ సాహుకి పట్టణంలో రాకీ సాన్ పేరుతో హోటల్, ఫంక్షన్ హాల్, అనేక వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఒకసారి దోపిడి దొంగలు సునీల్‌ని అపహరించుకుపోయారు. సుమారు నెల రోజులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అతని కుటుంబ సభ్యులు దొంగలతో చర్చలు జరిపి విడిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వం సునీల్‌కి గన్‌మెన్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సునీల్ సాహు అధికార పార్టీకి ఆర్థికంగా కీలకంగా వ్యవహరించారు. 13వ తేదీ రాత్రి వరకు సునీల్ స్వగ్రామంలోనే ఉంటూ ఎన్నికలు పర్యవేక్షించారు. అతనిపై దాడిచేస్తే పెద్ద ఎత్తున లబ్ధి పొందవచ్చుననే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందనే ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ సునీల్ తన మకాం నబరంగ్‌పూర్‌కి మార్చడంతో దొంగల అంచనా తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment