అట్రి పాసింజర్ హాల్టు ప్రారంభం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఖుర్దారోడ్ మండలంలో రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథం శరవేగంగా సాగుతోంది. ఖుర్దారోడ్ – బొలంగీరు రైలు మార్గం ప్రాజెక్టు పనుల్ని ఉభయ దిశల్లో నిర్వహిస్తుండగా.. తాజాగా అట్రి పాసింజర్ హాల్టు స్టేషన్‌ను బుధవారం ప్రారంభించారు. రూ. 58 లక్షలు వెచ్చించి ఈ ప్లాట్‌ఫారమ్ నిర్మాణం పూర్తి చేశారు. ఖుర్దారోడ్ – దసపల్లా దిశలో ఇది రెండో ప్రయాణికుల హాల్టు స్టేషను కావడం విశేషం. గతంలో బొలొగొడొ పాసింజర్ హాల్టు స్టేషనును ప్రారంభించారు. మరో రెండు స్టేషన్ల నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ జాబితాలో సన్నొపొదొరొ, తొరాబొయి స్టేషన్లు ఉన్నాయి. త్వరలో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో స్థానిక పార్లమెంటు సభ్యురాలు అపరాజిత షడంగి, ఎమ్మెల్యేలు ప్రదీప్ కుమార్ సాహు (బెగుణియా), ప్రశాంత కుమార్ జగదేవ్ (ఖుర్దా), ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం హెచ్.ఎస్.బాజ్వా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment