నేడు అమరేశ్వరుని తెప్పోత్సవం
అమరావతి: కార్తికపౌర్ణమి సందర్భంగా శుక్రవారం అమరావతిలో అమరేశ్వరునికి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సునీల్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఉత్సవ వివరాలను తెలియజేశారు. కార్తికపౌర్ణమి పర్వదినాన అమరేశ్వరాల యాన్ని సందర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో క్యూలైన్లను ఏర్పాటు చేసి పోలీస్‌శాఖ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ, దేవాలయం, స్నానఘాట్‌లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం, సుమారు 50వేల లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామన్నారు. శుక్రవారం రాత్రికి స్వామి వారి గ్రామోత్సవం, అనంతరం కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం, జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహించటానికి వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
డిసెంబర్ 14న
జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేటటౌన్: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ గురువారం తెలిపారు. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్ కేసులు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని విలువైన సమయం వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు.
అపార్ ఐడీ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి
గుంటూరు ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి
సత్తెనపల్లి: విద్యార్థులకు జారీచేసే అపార్ ఐడీ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని గుంటూరు ఆర్‌జేడీ ఆర్.లింగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, 23వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అపార్ ఐడీ కార్డులు జారీకి సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వాటిని ఎలా అధిగమించాలనే దానిపై పలు సూచనలు చేశారు. ముందుగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయనతోపాటు మండల విద్యాశాఖ అధికారులు ఎ.శ్రీనివాసరావు, ఎ.రాఘవేంద్రరావు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
23న ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం
బాపట్ల: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న గుంటూరు జెడ్పీ ఏసీ సమావేశ మందిరంలో జరుగుతుందని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, 23న జరుగుతుందని వివరించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరుకావాలని కోరారు.
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నరసరావుపేట తరలింపు
రాజుపాలెం: మండలంలోని కొండమోడులోగల డాక్టర్ అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని గురువారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్ చదువుతోంది. హాస్టల్ రూమ్‌లో డబ్బులు పోవడంతో ఆమెను అనుమానించడంతో మనస్థాపంతో భవనంపై నుంచి దూకినట్లు తెలిసింది. తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment