వైద్యకళాశాల అభివృద్ధికి జింకానా చేయూత
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి జింకానా ఎంతో చేయూతనిస్తోందని గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి, గుంటూరు జీజీహెచ్ పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్ నిర్మాత డాక్టర్ పొదిల ప్రసాద్ అన్నారు. గురువారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో 2024 ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. వైద్య విద్యార్థులకు కాలేజ్ అడ్మిషన్ గుర్తింపు కార్డులు, వైట్ కోట్‌లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పొదిల ప్రసాద్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాలలో అభ్యసించిన తాను ఇప్పుడు అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య కళాశాలలో క్రమశిక్షణతో వైద్య విద్యనభ్యసించాలని, వృత్తిలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవడంతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రూ.100 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఎంసీహెచ్ వార్డుకు గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు భారీగా విరాళాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వేడుకలు జరుగుతున్న జింకానా ఆడిటోరియం కూడా పూర్వ వైద్య విద్యార్థుల విరాళాలతోనే నిర్మించారన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకొని తాను ప్రిన్సిపాల్‌గా ఎదిగినట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకరరావు, మానసిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి, జింకానా కో–ఆర్డినేటర్లు డాక్టర్ బాలభాస్కరరావు, డాక్టర్ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ పొదిల ప్రసాద్ వైద్య కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment