‘అల’రింతకు సిద్ధం
బాపట్లటౌన్: కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాలకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సూర్యలంక తీరాన్ని అధికారులు ముస్తాబు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతోపాటు వసతులు కల్పించారు. జల్లు స్నానాలకు ప్రత్యేకంగా షవర్ పాయింట్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 150 తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. స్నానాలకు వచ్చే భక్తులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ జి.రామాంజనేయులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు సముద్రంలోకి దిగకుండా జల్లు స్నానాలు చేయాలని చెప్పారు. తీరంలో ఏర్పాటుచేసిన జెండాలు దాటి సముద్రంలోకి వెళ్లరాదని పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సులు
బాపట్ల నుంచి సూర్యలంక సముద్రతీరానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గుంటూరు బస్టాండ్ నుంచి నేరుగా ఐదు బస్సులు సూర్యలంక తీరానికి చేరుకుంటాయని, వీటితోపాటు బాపట్ల పాతబస్టాండ్ నుంచి నేరుగా తీరం వరకు పది ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాన సూర్యలంకకు చేరుకునే భక్తుల సౌకర్యార్థం రైలు సమయాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్ నుంచి రెండు బస్సులను నడుపుతున్నట్టు బాపట్ల ఆర్టీసీ డీఎం శ్రీమన్నారాయణ తెలిపారు.
తీరంలోని తోటలూ సిద్ధం
పుణ్యస్నానాలు అనంతరం వనభోజనాలకు తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిమామిడి తోటలు, వననర్సరీలోని నేరుడు చెట్ల కింద అధికారులు ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏకో రిసార్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. తీరంలో ఉన్న తారకేశ్వరస్వామి దేవాలయంతోపాటు, ఆంజనేయస్వామి ఆలయం, నవగ్రహాలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యాయి.
పటిష్ట బందోబస్తు
పుణ్యస్నానాల నేపథ్యంలో తీరంలో 316 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. బందోబస్తు నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, వీరితోపాటు కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 316 మంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నా రు. సూర్యలంక నుంచి బాపట్ల వరకు ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టనున్నట్టు రూరల్ సీఐ తెలిపారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్ల బృందాలను సిద్ధం చేశారు. 15వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు.
నాలుగు బీచ్‌ల వద్ద బందోబస్తు
కార్తిక పౌర్ణమి సందర్భంగా నాలుగు బీచ్‌ల వద్ద 400 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. గురువారం రాత్రి జిల్లాలోని సూర్యలంక, రామాపురం, ఓడరేవు, నిజాంపట్నం సముద్రతీర ప్రాంతాల్లో బందోబస్తుపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
కార్తిక పున్నమికి సూర్యలంక ముస్తాబు పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment