ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ రగడ

Published Sun, Nov 24 2024 6:03 PM | Last Updated on Sun, Nov 24 2024 6:03 PM

ప్రొటోకాల్‌ రగడ

ప్రొటోకాల్‌ రగడ

జెడ్పీ సమావేశంలో

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీటీసీలకు తెలియకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతో ఏకపక్షంగా పనులు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు.

శిలా ఫలాకాలపై టీడీపీ నాయకుల పేర్లపై అభ్యంతరం

జెడ్పీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ప్రజాప్రతినిధులమైన తమ పేర్లు లేకుండా టీడీపీ నాయకుల పేర్లు రాయడంపై రొంపిచర్ల, నాదెండ్ల జెడ్పీటీసీ సభ్యులు ఓబుల్‌రెడ్డి, మస్తాన్‌రావు అధికారులను నిలదీశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి మండలం ఎనికేపాడు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలపై జెడ్పీటీసీ, సర్పంచ్‌ల పేర్లు రాయకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాలని ఎంపీపీ మేకల హనుమంతరావు నిలదీశారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ శిలాఫలకాలపై టీడీపీ నాయకుల పేర్లు రాసిన సంఘటనలు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరగవని, దీనిపై అధికారులను బాధ్యులను చేయడం ద్వారా ప్రయోజనం లేదన్నారు. శిలాఫలకాలపై ముద్రించిన టీడీపీ నాయకుల పేర్లు తుడిచేందుకు ప్రయత్నించే సాహసాన్ని అధికారులు చేయలేరని అన్నారు. ఎమ్మెల్యేలతో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరగకండా చూడాలని అన్నారు. మరో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ప్రొటోకాల్‌పై కఠినంగా వ్యవహరించాలని, కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి కూడా తనను ఆహ్వానించని విషయాన్ని గుర్తుచేశారు.

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరగకుండా చూస్తాం

ప్రొటోకాల్‌పై సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో ప్రొటోకాల్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వతంగా చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశంలో రాజకీయపరమైన విభేదాలు వద్దని అన్నారు.

ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం తగదు

మండలంలో తనకు తెలియకుండా ఏకపక్షంగా పనులు మంజూరు చేయడంపై రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ను నిలదీశారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో నేరుగా పనులు మంజూరు చేస్తే ఇక తామెందుకని ప్రశ్నించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా పనులు కట్టబెట్టేసి, వాటిని ఆమోదించేందుకు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. దశాబ్దాల తరబడి ఉన్న సంప్రదాయాన్ని కాలరాశారని విమర్శించారు. హెనీ క్రిస్టినాతోపాటు సీఈవో వి.జ్యోతిబసు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

● ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఉచిత విద్య నిరాకరణపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని విద్యార్థులను ఫీజు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చారని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు స్పష్టం చేశారు.

● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాల మంజూరులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్యే బి.రామాంజనేయులు వ్యవసాయశాఖాధికారులను నిలదీశారు.

● అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు మాట్లాడుతూ పేరుకే రాజధాని తప్ప అమరావతిలో జెడ్పీ హైస్కూల్‌ లేకపోవడం సిగ్గుచేటన్నారు. తాను ప్రతి సమావేశంలోనూ అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా ప్రయోజనం శూన్యమన్నారు.

● ముట్లూరు జెడ్పీ హైస్కూళ్లో 600 మంది విద్యార్థులు ఉండగా, బోధనేతర సిబ్బంది ఒక్కరూ లేరని, తక్షణమే నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు.

● బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ నిర్బంధ విద్యా హక్కుచట్ట ప్రకారం పేదల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించని పాఠశాలల వివరాలను బహిరంగ పర్చాలని, చట్టం అమల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తన దృష్టికి తేవాలని మూడు జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.

● రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు అమ్మకు వందనం కింద రూ.15వేలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఆ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.

● పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ మాచర్ల మండలంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో టాయిలెట్‌ వసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక టన్ను రూ.600 ఉంటే ప్రస్తుతం రూ.1,500 చేరిందని, ఇక ఉచితం ఎక్కడని నిలదీశారు. భట్టిప్రోలు పీహెచ్‌సీలో వైద్యులు మధ్యాహ్న 12 గంటలకే వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. పాఠశాలల వద్ద విక్రయిస్తున్న నాసిరకం తినుబండారాల విక్రయాలను తక్షణమే ఆపి వేయాలని కోరారు. వట్టిచెరుకూరు రింగ్‌రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పల్నాడు జేసీ జి.సూరజ్‌ భరద్వాజ్‌ ధనుంజయ్‌, బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్‌ కృష్ణ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలల్లో తాగునీటి కొరతపై ఆగ్రహం

పత్తి కొనుగోలు బాధ్యత సీసీఐదే

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌

పత్తి కొనుగోలులో సీసీఐ అధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధిస్తున్నారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ అన్నారు. నల్లకాయ వచ్చిందని, తడి చేరిందని రైతులు తెచ్చిన పత్తిని వెనక్కి పంపుతున్నారని, ఎటువంటి షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు చేపడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కాకుమానులోని ఎస్సీ గురుకుల పాఠశాలలో తాగునీటి కొరతపై ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ప్రతి సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా శాశ్వత చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇదే అంశంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మాట్లాడుతూ ఎస్సీ బాలికల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, జిల్లా కలెక్టర్‌ స్వయంగా వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు జెడ్పీ నిధులను పూర్తిస్థాయిలో కేటాయించాలని కోరారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తోపాటు నీతి ఆయోగ్‌ నిధులను హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయగా, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి జోక్యం చేసుకుని నెలరోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement