అట్టహాసంగా ఖోఖో పోటీలు ప్రారంభం
ప్రారంభించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
కారెంపూడి: స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన బాల, బాలికల జట్ల క్రీడాకారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ గౌరవవందనం స్వీకరిస్తూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించడం ద్వారా దేహదారుఢ్యంతోపాటు మానసిక వికాసాన్ని పొందవచ్చని, క్రీడల ద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుందని, విద్యాభ్యాసం కూడా మెరుగ్గా సాగుతుందన్నారు.
తొలి పోటీల విన్నర్స్
బాలుర విభాగంలో..
బాలుర విభాగంలో తొలి మ్యాచ్ గుంటూరు, శ్రీకాకుళం జట్ల మధ్య జరిగింది. శ్రీకాకుళం జిల్లా జట్టుపై గుంటూరు జిల్లా జట్టు 12–11 తేడాతో విజయం సాధించింది. అనంతపురంపై విశాఖపట్నం జట్టు 17–15తో విజయం సాధించింది. నెల్లూరు జట్టుపై ఈస్ట్ గోదావరి జట్టు 15–13తో విజయం సాధించింది. వెస్ట్ గోదావరి జట్టుపై విజయనగరం జట్టు 14–7 పాయింట్ల తేడాతో విజయం సాధించాయి.
బాలికల విభాగంలో...
బాలికల విభాగంలో కర్నూలు జట్టుపై వెస్ట్ గోదావరి జట్టు 10–6 తేడాతో విజయం సాధించింది. నెల్లూరు జట్టుపై విజయనగరం జట్టు 6–3తో విజయం సాధించింది. కృష్ణా జిల్లా జట్టుపై అనంతపురం జట్టు 15–1 తేడాతో గెలిచింది. గుంటూరు జట్టుపై కడప జిల్లా జట్టు 9–7 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. క్రీడాభిమానుల ఆనందోత్సాహాల మధ్య తొలి రోజు పోటీలు రసవత్తరంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment