భళిర బైపాస్
నాదెండ్ల: చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు ప్రారంభానికి రోడ్డు సిద్ధమైంది. ఈ నెల 28,29 తేదిల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. 16.5 కిలోమీటర్ల పొడవున రూ.520 కోట్లతో నిర్మించిన బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే పేట ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట రూరల్ మండలం తాతపూడి గ్రామం వరకూ 16.5 కిలోమీటర్ల పొడవున బైపాస్ రోడ్డు నిర్మించారు. 330 ఎకరాలను రైతుల వద్ద భూ సేకరణ చేసి రోడ్డు నిర్మాణం చేశారు. రైతులకు పరిహారంగా రూ.380 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ 16.5 కిలోమీటర్ల పొడవున మూడు ఫ్‌లైఓవర్లు, ఆరు అండర్‌పాస్‌లు, రెండు మేజర్ బ్రిడ్జిలు, రెండు మైనర్ బ్రిడ్జిలు, మూడు బాక్సు కల్వర్టులు, 44 సిమెంటు పైపు కల్వర్టులు వేశారు.
ఆరు లైన్లతోపాటు సర్వీసు రోడ్లను నిర్మించటంతో వాహనాల రాకపోకలకు ఎక్కడా అంతరాయం కలగకుండా సాగనున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు నిర్మాణం చేశారు.
రహదారికి ఇరువైపులా సోలార్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. రోడ్డు పరిధిలో రెండు చోట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. పగలు సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి రాత్రి వేళల్లో గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుని వీధి లైట్లు వెలగనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులతో పాటూ ఇప్పటికే ఉన్న రహదారుల వెంబడి సోలార్ వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ హైవేస్ అధికారులు తెలిపారు.
పచ్చని చెట్లు, పూలమొక్కలతో సుందరంగా..
బైపాస్ రోడ్డు ఇరువైపులా గానుగ, వేప, నల్లమద్ది, గుల్మోరా, పెంట్‌ఫామ్ జాతుల మొక్కలు నాటారు. ఇప్పటికే మూడున్నర వేల మొక్కలను నాటారు. రోడ్డుకు ఇరువైపులా అంచుల వెంబడి గ్రీన్ టర్పింగ్ గ్రాస్ ఏర్పాటుచేశారు. రహదారి ఆక్రమణలకు గురికాకుండా రెండు వైపులా ప్రహరీ నిర్మించారు. ప్రతి మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటుచేసి సంరక్షించనున్నారు. వీటికి ప్రతినిత్యం నీటిని అందించేందుకు రెండు చోట్ల బోరు పాయింట్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించనున్నారు.
చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం పూర్తి ఈ నెలాఖరు నాటికి ప్రారంభం 16.5 కిలోమీటర్ల పొడవున రూ.520 కోట్లతో నిర్మాణం భూమి నష్టపరిహారంగా మరో రూ.380 కోట్లు ముమ్మరంగా ముగింపు పనులు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోనున్న వాహనాలు పేట ప్రజలకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు
చిలకలూరిపేట బైపాస్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాం. రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీ, సోలార్ విద్యుత్ లైట్లు, అండర్ పాస్‌ల వద్ద సోలార్ బ్లింకర్స్, జీబ్రాలైన్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. 16.5 కిలోమీటర్ల మేర 3,500 మొక్కలు నాటాం. గ్రీన్ టర్పింగ్ గ్రాస్ వేశాం. నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు రోడ్డు ప్రారంభించనున్నాం.
– మురళీమోహన్‌రావు, చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చురుగ్గా పనులు
యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం తాతపూడి వరకూ 2009లో జాతీయ రహదారి బైపాస్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ అనుమతి ఇచ్చింది. బైపాస్‌కు భూములు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు ఆధ్వర్యంలో బైపాస్ వ్యతిరేక పోరాటాన్ని రైతులు చేపట్టారు. బైపాస్ ప్రాజెక్టు అనుమతులు 2011లో రద్దయ్యాయి. తిరిగి 2016లో మరోసారి బైపాస్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. రైతులు మరోసారి ఉద్యమించటంతోపాటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను సమన్వయం చేసి మెరుగైన నష్టపరిహారం అందించి భూ సేకరణ చేశారు. బైపాస్ నిర్మాణం ప్రారంభమైంది. కరోనా కారణంగా కొంతమేర పనులకు అంతరాయం కలిగినా 2021 నుంచి పనుల్లో వేగం పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment