నరసరావుపేట: మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి పల్నాడు రోడ్‌లోని పూలే కాంస్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మంత్రివర్గంలో 27 మంది మంత్రులు ఉంటే 11 మంది బీసీలేనని, సామాజిక న్యాయానికి అసలైన అర్థం చెప్పింది జగనేనని కొనియాడారు. 17 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే అందులో 11 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కేటాయించారని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిందని విమర్శించారు. గత ప్రభుత్వం నరసరావుపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవులు రెండు ఉంటే ఒకటి మైనార్టీలకు, మరొకటి బీసీ వర్గానికి కేటాయించినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండు మార్కెట్ యార్డు చైర్మన్ పదవులనూ ఉన్నత వర్గాలకే కేటాయించిందని పేర్కొన్నారు.
బీసీ భవన్ త్వరగా నిర్మించాలి
నరసరావుపేటలో బీసీ భవన్ నిర్మాణం కోసం తమ ప్రభుత్వ హయాంలో 18 సెంట్ల స్థలాన్ని కలెక్టరేట్ ఎదురు కేటాయించామని గోపిరెడ్డి వివరించారు. ప్రస్తుతం ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తాము బీసీ భవన్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తక్షణమే బీసీ భవన్‌కు నిధులు కేటాయించి నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు ఈఎం.స్వామి, కందుల ఎజ్రా, పాలపర్తి వెంకటేశ్వరావు, పార్టీ బీసీ విభాగం పట్టణ కన్వీనర్ అచ్చి శివకోటి తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలోనే సామాజిక న్యాయం
నరసరావుపేటలో బీసీ భవన్ త్వరగా నిర్మించాలి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి జ్యోతీరావు పూలేకు నివాళులు
Comments
Please login to add a commentAdd a comment